రాజశేఖరరెడ్డి మాట తప్పని నాయకుడు. జగనన్న ఇచ్చిన ప్రతి మాటా తప్పారు. అందుకే వైకాపా ప్రభుత్వం పోవాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు, కాకినాడ జిల్లా తునిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆమె ప్రసంగించారు. ‘రాజశేఖర్‌రెడ్డి ప్రజల మధ్య బతికిన మనిషి, జగన్ అయిదేళ్లలో ఎప్పుడూ ప్రజల మధ్య లేరు. ఎన్నికలు రావడంతో ఇప్పుడు ‘సిద్ధం’ అంటూ బయల్దేరారు. మళ్లీ రూ.8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా.. భాజపాతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా.. ప్రజలను, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి సిద్ధమా.. మద్యపాన నిషేధమని.. 25 లక్షల ఇళ్లు కడతానని మోసం చేయడానికి సిద్ధమా’ అంటూ ప్రశ్నించారు.
మట్టిచెంబు ఇచ్చి.. వెండిచెంబు దోపిడీ
‘పథకాల రూపంలో ఓ చేత్తో మట్టిచెంబు ఇచ్చి, మరో చేత్తో వెండిచెంబు దోచేస్తున్నారు. ఎన్నికల ముందు అందరికీ అమ్మఒడి అని చెప్పిన జగన్.. గెలిచిన తర్వాత ఒక్కరికే ఇస్తున్నారు. పింఛన్లు, పథకాలతో గోరంత ఇస్తూ.. లిక్కర్, ఇసుక, మైనింగ్‌లతో కొండంత దోచుకుంటున్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మద్యం అనేది లేకుండా చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతానని అన్నారు. ఏమైంది ఆ నిషేధం..? మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వమే చేస్తోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం భార్య పండగ చేసుకుంటే సరిపోతుందా?
‘రాష్ట్రంలో 19 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు లేవు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ నెలలోని సంక్రాంతికి ముఖ్యమంత్రి, ఆయన సతీమణి పట్టుబట్టలు కట్టుకుని పండగ చేసుకుంటారు. జాబ్ క్యాలెండర్ మాత్రం లేదు. మెగా డీఎస్సీలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, ఇప్పుడు ఎన్నికల సమయంలో 6వేల ఉద్యోగాలకు దగా నోటిఫికేషన్ ఇచ్చారు’ అంటూ విమర్శించారు.
హోంమంత్రి పదవికి రాజీనామా చేయండి
‘సాక్షాత్తు హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోని దళితులకే రక్షణ లేదు. ఆ పదవికి రాజీనామా చేసి సమర్థులకు అప్పగించండి’ అంటూ హోంమంత్రి తానేటి వనితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తుని నియోజకవర్గంలో దివిస్ పరిశ్రమ ఉండడానికి వీల్లేదని.. బంగాళాఖాతంలో కలుపుతానన్నారు. సీఎం అయ్యాక యథేచ్ఛగా అనుమతులిచ్చారు. తుని ఎమ్మెల్యే ఆర్‌అండ్‌బీ మంత్రి అయినా ఇక్కడి రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఆయన ఇసుక మాఫియాకు రాజా.. గుట్కా వ్యాపారం, లిక్కర్ దందా, పేకాట.. ఇలా చేయని వ్యాపారం లేదు. ఈయన పేరు దాడిశెట్టి రాజా కాదు.. అనుభవించు రాజా అని ఓ అన్న తనతో చెప్పాడని’ షర్మిల వివరించారు.
source : eenadu.net
Discussion about this post