అనంతపురం క్రైం కేసులో పిస్టల్ చూపి డబ్బులు దండుకుంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సందర్భంగా వారి నుంచి పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అన్బురాజన్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన తొండపాటి సుధాకర్‌కు గుత్తి మండలం తురకపల్లికి చెందిన జయకృష్ణారెడ్డి, ఎర్రగుడికి చెందిన ప్రశాంత్ అనే బొల్లినేని ప్రశాంత్‌నాయుడుతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి.
ఈ నెల 1వ తేదీన కృష్ణారెడ్డి, ప్రశాంత్‌నాయుడులు ద్విచక్ర వాహనంపై వచ్చి గుత్తి మార్గంలోని సుంకులమ్మ దేవాలయం సమీపంలో సుధాకర్‌ను తుపాకీతో బెదిరించి అతని వద్ద ఉన్న ₹11,500 నగదు అపహరించారు.
అనంతరం ప్రశాంత్ నాయుడు సుధాకర్‌ను సంప్రదించి మిగిలిన డబ్బును డిమాండ్ చేస్తూ పిస్టల్‌తో బెదిరించాడు. దీంతో భయపడిన సుధాకర్ నవంబర్ 22న గుత్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
శుక్రవారం సీఐ వెంకటరామిరెడ్డికి అందిన సమాచారం మేరకు గుత్తి మండలం కరిడికొండ వద్ద జాతీయ రహదారిపై రామిరెడ్డి అలియాస్ ప్రశాంత్‌నాయుడు, తొగుట్ల రామ్మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Discussion about this post