అనంతపురం అర్బన్:
కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ పిండం లింగనిర్ధారణ తీవ్ర నేరమన్నారు. లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై పాఠశాలల్లో బాలికలకు అవగాహన కల్పించాలని సూచించారు.
శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో భ్రూణ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై జిల్లా స్థాయి సంయుక్త కమిటీ సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఎక్కడైనా పిండం లింగ నిర్ధారణ చేస్తున్నట్లు తేలితే వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
అదే క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి ఇప్పటి వరకు దవాఖానలు, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, ఆదాయానికి సంబంధించి మరోసారి తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యా, వైద్య, శిశు సంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా లింగ నిర్ధారణ నిషేధ చట్టం, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సేవ్ గర్ల్ చైల్డ్ పై కింది స్థాయిలో అవగాహన తీసుకురావాలన్నారు.
పాఠశాలల్లో బాలికా సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. రాయదుర్గం రూరల్, గుంతకల్లు రూరల్, శెట్టూరు తదితర మండలాల్లో ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉందన్నారు.
లింగ నిష్పత్తిని సమాన స్థాయికి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సమగ్ర బాలల సంరక్షణ పథకం పోస్టర్లను కలెక్టర్, అధికారులు విడుదల చేశారు.
కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి టి.హరిత, డిఎంహెచ్‌ఓ భ్రమరాంబ దేవి, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, డిసిహెచ్‌ఎస్ పాల్ రవికుమార్, డిఐవో యుగంధర్, మెప్మా పిడి విజయలక్ష్మి, డిఇఓ నాగరాజు, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి పాల్గొన్నారు.
Discussion about this post