అనంతపురం క్రైం:
ప్రజలను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ మునిరామయ్య స్పష్టం చేశారు. గురువారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేశామన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ‘టాస్క్‌ఫోర్స్’ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అక్రమార్కులు, నకిలీ నోట్లపై ఫిర్యాదు చేసేందుకు 08554-241249 నంబర్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచారు.
అపరిశుభ్ర వాతావరణంలో హోటళ్లు, సినిమా హాళ్లు ఉంటే ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టిస్తున్నా, అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్నా ఫిర్యాదు చేయాలని సూచించారు.
పన్ను ఎగవేతదారుల సమాచారం అందించాలని కోరారు. కొన్ని చోట్ల హాస్టళ్లలో విద్యార్థులకు సరైన ఆహారం అందడం లేదని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సులు పంపారు.
గర్భిణులు, బాలింతలకు ఇస్తున్న పౌష్టికాహారంపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం కిలో బియ్యాన్ని రూ.47కి కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా అందజేస్తోందన్నారు.
అక్రమార్కులు ఆ బియ్యాన్ని రూ.10-12కు కొనుగోలు చేసి, పాలిష్ చేసి రూ.60కి విక్రయించి ప్రభుత్వానికి సొమ్ము చేసుకుంటున్నారు. కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. బలవర్థకమైన బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయని ప్రజలు గుర్తించి బియ్యాన్ని విక్రయించకూడదన్నారు.
ఇప్పటి వరకు రూ.88.05 కోట్ల వివిధ రకాల పన్నులు వసూలయ్యాయని చెప్పారు. వాహన తనిఖీల్లో రూ.3.38 కోట్ల జరిమానా విధించారు. ఇప్పటి వరకు 39 చౌక దుకాణాలు, 11 మండల స్టాక్ పాయింట్లు, 140 మిల్లులు, వ్యాపార సంస్థలు, 3- అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, 21- ఎరువుల దుకాణాలు, 3- సినిమా థియేటర్‌లను తనిఖీ చేశారు.
నిత్యావసర వస్తువుల చట్టంలోని 6(ఏ)/7(1) కింద 314 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రూ.44.66 లక్షలు విలువ చేసే 62.524 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 7 దుకాణాల్లో రూ.91,575 విలువైన ఉత్పత్తులను సీజ్ చేశారు.
Discussion about this post