అనంతపురం సిటీ:
హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో భయపడిన ఓ విద్యార్థి బెంగళూరు వెళ్తున్న రైలు ఎక్కాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై అనంతపురంలో బాలుడిని అదుపులోకి తీసుకుని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ రామలక్ష్మి ఎదుట హాజరుపరిచారు. వివరాలు…
కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా దేవదుర్గానికి చెందిన నూర్జహాన్ బేగం, హబీబ్ బాషా దంపతుల కుమారుడు సౌకత్ అలీ… అదే గ్రామంలోని హాస్టల్ లో ఉంటూ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. హోంవర్క్ చేయకపోవడంతో ఆదివారం ఉపాధ్యాయుడు మందలించాడు.
దీంతో ఆ బాలుడు మనస్తాపం చెంది పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. ఉపాధ్యాయుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లు, రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు.
విషయం తెలుసుకున్న అనంతపురం ఆర్పీఎఫ్ సీఐ మధుసూదనాచారి, జీఆర్పీ ఎస్ ఐ విజయ్కుమార్, సిబ్బంది సోమవారం రాయచూర్ నుంచి వచ్చే రైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
మిషన్ వాత్సల్య డివిజన్ డీసీపీఓ వెంకటేశ్వరి, చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రోగ్రాం అధికారి కృష్ణమాచారి, ప్రొటెక్షన్ అధికారి చంద్రకళ, సామాజిక కార్యకర్త నాగలక్ష్మి కూడా రైల్వే స్టేషన్‌కు చేరుకుని విచారించారు. ఇంతలో, సాయంత్రం అనంతపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న బెంగళూరు వెళ్లే రైలులో బాలుడిని గుర్తించి స్టేషన్‌కు తరలించారు.
బాలుడి తమ్ముడు నవాబ్జాన్‌ను పిలిచి మాట్లాడారు. అనంతరం బాలుడిని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ రామలక్ష్మి ఎదుట హాజరుపరిచి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Discussion about this post