మధుమేహం ముప్పు కారకాలనగానే అధిక బరువు, ఊబకాయం, బద్ధకంతో కూడిన జీవనశైలి, కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉండటం, కాలేయానికి కొవ్వు పట్టటం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి
మధుమేహం ముప్పు కారకాలనగానే అధిక బరువు, ఊబకాయం, బద్ధకంతో కూడిన జీవనశైలి, కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉండటం, కాలేయానికి కొవ్వు పట్టటం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి.
దీనికిప్పుడు అదనపు ఉప్పు వాడకాన్నీ జోడించుకోవాల్సిన అవసరం వచ్చింది. అమెరికాలోని టులానే యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన లు కి, ఆయన బృందం అధ్యయనం దీన్నే సూచిస్తోంది.
మధుమేహం బారినపడకూడదని కోరుకుంటున్నారా? అయితే ఉప్పు అదనంగా వాడటం మానెయ్యండి. ఉప్పుతో మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా బయటపడింది మరి. దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఆహార అలవాట్లను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు.
ఆహారంలో అదనంగా ఉప్పు అసలే వేసుకోని లేదా ఎప్పుడో అప్పుడు వేసుకునేవారితో పోలిస్తే తినే ప్రతిసారీ ఉప్పు ఎక్కువగా వాడేవారికి మధుమేహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. ఉప్పు పరిమితిని పాటిస్తే గుండెజబ్బు, అధిక రక్తపోటు ముప్పులు తగ్గుతాయని ఇప్పటికే తెలుసు.
అయితే ఇది టైప్2 మధుమేహం ముప్పునూ తగ్గిస్తున్నట్టు తమ పరిశోధనల్లో తొలిసారి రుజువైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ లు కి చెబుతున్నారు. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్‌లో నమోదైన వారి ఆరోగ్య సమాచారాన్ని ఇందులో విశ్లేషించారు.
ఆహారంలో అదనంగా ఉప్పు అసలే కలపని లేదా అరుదుగా కలిపి తినేవారికి మధుమేహం ముప్పు 13% ఎక్కువగా ఉంటుండగా.. కొన్నిసార్లు వేసుకునేవారికి 20%, తరచూ వేసుకునేవారికి 39% ముప్పు అధికంగా ఉంటున్నట్టు తేలింది.
జీవనశైలి, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, ఇతర సంప్రదాయ మధుమేహ కారకాలతో సంబంధం లేకుండా ఉప్పుతో ముప్పు పెరుగుతుండటం విశేషం. దీనికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియరాలేదు గానీ అదనంగా ఉప్పు కలపటం వల్ల ఎక్కువెక్కువ తినటానికి కారణమవుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
దీంతో ఊబకాయం, కణ అంతర్గత వాపు ప్రక్రియ పెరిగే అవకాశముంది. ఇవి రెండూ మధుమేహం ముప్పు కారకాలే.
Discussion about this post