విద్యుత్తు శాఖలో ఓ అధికారి అవినీతి దందా సాగిస్తున్నారు. రైతులకు విద్యుత్తు నియంత్రికల మంజూరు నుంచి ఉద్యోగ నియామకాల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులిస్తే ఏ పనైనా జరిగిపోతుందనేలా పరిస్థితి మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం డివిజన్ గరుడాపురం, ములకలేడు సబ్‌స్టేషన్ల పరిధిలో సుమారు 16 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నారు.
విద్యుత్తు శాఖలో ఓ అధికారి అవినీతి దందా సాగిస్తున్నారు. రైతులకు విద్యుత్తు నియంత్రికల మంజూరు నుంచి ఉద్యోగ నియామకాల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులిస్తే ఏ పనైనా జరిగిపోతుందనేలా పరిస్థితి మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం డివిజన్ గరుడాపురం, ములకలేడు సబ్‌స్టేషన్ల పరిధిలో సుమారు 16 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నారు. ఓ మహిళా ప్రజాప్రతినిధితో కలిసి ఒక్కో ఉద్యోగానికి రూ.9 లక్షలు వసూలు చేశారు. నిబంధనలు తుంగలోకి తొక్కి ప్రజాప్రతినిధి చెప్పిన వారికే పోస్టింగ్ ఇచ్చారు. 16 మంది నుంచి రూ.1.28 కోట్లు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చారు. మరో 16 మందికి కొలువులు ఇస్తామంటూ వారి నుంచి రూ.8 లక్షల చొప్పున రాబట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. షిఫ్ట్ ఆపరేటర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయలేదు. మహిళా ప్రజాప్రతినిధి సిఫార్సు చేసిన వారికి కొలువులు ఇస్తున్నారు. ఇప్పటికే గరుడాపురం సబ్‌స్టేషన్ పరిధిలో నలుగురికి ఉద్యోగాలు కల్పించి విధుల్లో చేర్పించారు. ప్రస్తుతం 12 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి నెల జీతం రూ.16 వేలు చెల్లిస్తారు. వాస్తవానికి షిఫ్ట్ ఆపరేటర్లకు స్కిల్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇదేమి నిర్వహించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా..
క్షేత్ర సిబ్బంది లేరనే కారణంతో కొత్తవారిని తీసుకోవాలనే ఎత్తుగడ వేశారు. ఈక్రమంలో కొందరిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జేఎల్‌ఎం గ్రేడ్-2 ఉద్యోగిని కార్యాలయంలో వ్యక్తిగత సహాయకుడిగా… మరొకరిని కారు డ్రైవర్‌గా నియమించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేయించుకుంటూ కొత్త వారికి మార్గం సుగుమం చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విధుల్లో ప్రమాదాలకు గురైన కొందరు సిబ్బంది ప్రస్తుతం సబ్‌స్టేషన్లలో పని చేస్తున్నారు. డబ్బులు తీసుకుని కొత్తగా నియమించకున్న షిఫ్ట్ ఆపరేటర్ల కోసం ఇప్పటికే సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న వారిని క్షేత్రస్థాయిలో పనులు చేపట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. లేదంటే పదవీ విరమణ తీసుకోవాలని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారుల అండ
కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సదరు అధికారిపై ముందు నుంచి అవినీతి అరోపణలు ఉన్నాయి. ఏడాది కిందట చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధి అండతో కొద్ది రోజుల వ్యవధిలోనే తిరిగి కళ్యాణదుర్గం రావడం గమనార్హం. కళ్యాణదుర్గం విద్యుత్తు డివిజన్ పరిధిలో జరుగుతున్న అవినీతికి కొందరు జిల్లా ఉన్నతాధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కళ్యాణదుర్గం పరిధిలో రైతుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై తూతూమంత్రంగా విచారించి… ఏమీ జరగలేదని నివేదికలు ఇవ్వడం గమనార్హం. కణేకల్లులో ఓ గుత్తేదారుతో కుమ్మక్కై ఒక్కో డీపీని రూ.2 లక్షలకు అమ్ముకున్నా ఇప్పటివరకు చర్యలు లేవు. అడ్మిన్‌స్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్న ఓ జేఏవో విధులకు హాజరు కావడం లేదు. ఆయనకు సదరు అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖలోని కొందరు ఉద్యోగులు సీఎండీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
Source: https://www.eenadu.net/telugu-news/districts/Anantapur/1/123239336
Discussion about this post