అనంతపురం అర్బన్:
తెలుగు భాషాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు పి.విజయబాబు అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు తీరుపై మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.గౌతమితో కలిసి అధికారులతో ఆయన సమీక్షించారు.
ముఖ్యమంత్రి ఆంగ్ల భాషకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని విజయబాబు అన్నారు. తెలుగు భాషను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పేదల భవిష్యత్తు కోసం ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించామన్నారు.
పాఠ్యపుస్తకాలు ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లీషులో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరికి భాషపై మక్కువ ఉంటుందని, భాషను కాపాడుకోవాలనే తపన ఉందన్నారు.
అయితే, అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించి పాలనా వ్యవహారాల్లో తెలుగు భాష అమలుకు కృషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆదేశాలు ప్రజలకు చేరాలంటే మాతృభాషలోనే ఉండాలి. కార్యక్రమంలో డీఆర్‌వో గాయత్రీదేవి, ఆర్డీఓ గ్రంధి వెంకటేష్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Discussion about this post