కంప్యూటర్లు, పరికరాలు కాలిపోయాయి
నగరంలోని శ్రీకంఠం కూడలి వద్ద ఉన్న ఐడీబీఐ బ్యాంకులో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో బ్యాంకు కార్యాలయం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పది నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో బ్యాంకు హాలులోని కుర్చీలు, కంప్యూటర్ సీపీయూలు, మానిటర్లు, కీబోర్డులు, ప్రింటర్లు, స్కానర్లు, క్యాబిన్‌లలోని పలు రికార్డులు దగ్ధమయ్యాయి.
స్ట్రాంగ్ రూం, లాకర్లకు మంటలు వ్యాపించలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి విద్యుదాఘాతం కారణమై ఉండవచ్చని ఏడీఎఫ్‌వో లింగమయ్య అభిప్రాయపడ్డారు. వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ విజయ్ మాట్లాడుతూ ఖాతాదారులు ఆందోళన చెందవద్దని, లాకర్లు, నగదు, నగలు భద్రంగా ఉన్నాయని తెలిపారు. వడియం పేట బ్రాంచ్‌లో నగదు లావాదేవీలను ధృవీకరించుకోవచ్చు. ప్రమాదం జరిగినా బ్యాంకులో ఫైర్ అలారం ఎందుకు మోగలేదనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ
గుంతకల్లు పట్టణంలోని సంజీవ్ నగర్ లో నివాసం ఉంటున్న ట్రెజరీ రిటైర్డ్ ఉద్యోగి రామభూషణ్ రాజు ఇంట్లో చోరీ జరిగింది. ఆయన కుమారుడు పుట్టపర్తిలో జనరల్ సర్జన్‌గా, కోడలు తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు.
వారంలో రెండు రోజులు పుట్టపర్తిలో మనుమడిని చూసుకుంటానని, మిగిలిన రోజులు గుంతకల్లులో ఉంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం పుట్టపర్తికి వెళ్లినట్లు తెలిపారు. సోమవారం ఉదయం ఇంటి ఆవరణను శుభ్రం చేసేందుకు కార్మికుడు వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి సమాచారం అందించాడు.
గుంతకల్లు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. కసాపురం ఎస్‌ఐ గోపాలుడు, సిఐ మహేశ్వర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అల్మారాలో దాచి ఉంచిన 55 తులాల బంగారం, 2,500 గ్రాముల వెండి, రూ.62 వేల నగదు కనిపించలేదని బాధితుడు తెలిపాడు.
క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పుట్లూరు మండలం కడవకల్లు..
మండలంలోని కడవకల్లు గ్రామంలో ఆదివారం చోరీ జరిగింది. స్థానిక కోట వీధిలో నివాసం ఉంటున్న రోశమ్మ ఇంట్లోని ట్రంకు పెట్టెలో ఉన్న రూ.2 వేల నగదుతోపాటు బంగారు గొలుసు, ఉంగరాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. అందులో కొన్ని రుణ బాండ్లు ఉన్నాయని బాధితుడు తెలిపాడు. పోలీసులు ఇంటిని పరిశీలించి విచారణ ప్రారంభించారు.
చౌక బియ్యం స్వాధీనం
యాడికి మండలం మీదుగా అక్రమంగా తరలిస్తున్న 17 క్వింటాళ్ల చౌక బియ్యాన్ని సోమవారం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ప్యాపిలి మండల సరిహద్దు ప్రాంతంలో సేకరించిన బియ్యాన్ని బొలెరో వాహనంలో కర్ణాటకకు తరలిస్తుండగా, పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు రాయలచెరువు సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాన్ని పట్టుకున్నారు.
రేషన్ బియ్యంగా నిర్ణయించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్ పల్లి, జక్కసానికుంట్ల గ్రామాలకు చెందిన కోట్ల రవితేజ రెడ్డి, పరశురాంలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ వెంకటరమణనాయక్, వ్యవసాయ అధికారి వాసు, సీఎస్‌డీటీ సూర్యనారాయణ, ఆర్‌ఐ ఆనంద్‌బాబు పాల్గొన్నారు.
Discussion about this post