ఉరవకొండ:
తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండ మండలం ఆమిడ్యాల గ్రామానికి చెందిన రైతు రామాంజినేయులు కుమారుడు సాయికృష్ణ(23) బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నాడు.
ఏదో ఒక పని చూసుకోమని తండ్రి చాలాసార్లు సూచించినా పట్టించుకోలేదు. తన వ్యక్తిగత అవసరాల కోసం తండ్రిని డబ్బుల కోసం తరచూ వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం డబ్బుల కోసం తండ్రితో గొడవపడ్డాడు. పని చేసి డబ్బులు సంపాదించాలని తండ్రి మందలించడంతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు.
ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు సాయికృష్ణను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ వెంకటస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Discussion about this post