పుట్లూరు: మండలంలోని అరకటివేముల గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి(42) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త కుమార్ మద్యానికి బానిసై పనిలేకుండా తిరుగుతున్నాడని తాగడం మానేయాలని సుబ్బలక్ష్మి కోరింది.
కానీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది.
ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు.
చికిత్సకు స్పందించక ఆమె శనివారం మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పుట్లూరు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు.
ఓ యువకుడి మృతి:
కూడేరు : ఐచర్ వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని హమాలీ నగర్‌కు చెందిన నవీన్(35) పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లాడు. అక్కడ డబ్బులు చెల్లించి శుక్రవారం సాయంత్రం తిరిగి వచ్చారు.
అర్ధరాత్రి కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలోని టోల్‌గేట్ వద్దకు రాగానే వేగంగా వస్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య నాగమ్మ, కుమారుడు మణికంఠ తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. నవీన్ సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కూడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Discussion about this post