కలెక్టర్ ఎం.గౌతమి మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని, వాహన చోదకులకు భద్రతా ప్రమాణాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు.
తపోవనం(అనంత రూరల్): రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని, వాహన చోదకులకు భద్రతా ప్రమాణాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలు, మహిళా సాధికారతపై ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వాహనం నడిపే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రమాదంలో ఒకరు చనిపోయినా కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రమాద మరణాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో వెళ్లేవారు సీటు బెల్టు పెట్టుకుంటే మరణాలు తగ్గుముఖం పడతాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి మాట్లాడుతూ ప్రాణం కంటే వాహనాల వేగం ముఖ్యం కాదన్నారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు పద్మశ్రీవల్లిలు మాట్లాడుతూ మహిళా సాధికారత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ద్విచక్రవాహన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆర్డీఓ గ్రంధి వెంకటేష్, డీటీసీ వీర్రాజు, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు లక్ష్మి, శాంతి, శారద, జయంతి, రోటరీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల తీరును మహిళలు ప్రదర్శన ద్వారా వెల్లడించారు. అనంతరం ధ్వజారోహణం, ద్విచక్రవాహన ప్రదర్శన నిర్వహించారు. సప్తగిరి కూడలి, క్లాక్ టవర్ మీదుగా ప్రదర్శన సాగింది.
Discussion about this post