‘జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా వ్యూహాత్మక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం.నెక్కడైనా గొడవలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలి’ అని కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) డాక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సహాయ కలెక్టర్ వినూత్న, డీఆర్‌ఓ రామకృష్ణారెడ్డి, ఎక్సైజ్ పర్యవేక్షకుడు మధుసూదన్ తదితరులతో కలిసి మాట్లాడారు. ఈనెల 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, దీనికి ముందు 72 గంటలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ 72 గంటల్లో డబ్బు, మద్యం, ఇతరాత్ర ప్రలోభాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీంలను అప్రమత్తం చేశామని, రూ.50 వేలకు మించి రావాణా చేస్తే సీజ్ చేస్తామన్నారు.
11వ తేదీ నుంచి జిల్లాంతటా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. పోలింగ్‌కు ముందు రెండు రోజులు, ఆ తర్వాత ఒక రోజు కీలకమని, నిర్దేశిత రోజుల్లో ఐదుగురికి మించి గుంపుగా ఉండకూడదన్నారు.. కేంద్ర బలగాలు జిల్లాకు వస్తున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు కోసం శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. వంద శాతం పీఎస్‌ల్లో వెబ్‌కాస్టింగ్ పెడుతున్నామని చెప్పారు.
ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటలకే ఎన్నికల ప్రచారానికి తెర పడాలని కలెక్టర్ ఆదేశించారు. ర్యాలీలు, రోడ్‌షో, వాహనాల ద్వారా ప్రచారం.. ఇలా అన్నింటికి ముగింపు పలకాల్సిందేనన్నారు. ఆ తర్వాత ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లలోపు ఎలాంటి ఫొటోలు, వీడియోలు తీయకూడదు. ఎన్నికల అధికారులు, సిబ్బంది మొబైళ్లు వాడకూడదన్నారు. ప్రతి నాలుగు పోలింగ్ కేంద్రాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. ఈవీఎంల మొరాయిస్తే సత్వరమే తగిన సౌకర్యాన్ని కల్పించడానికి ఈదపా ప్రతి నియోజకవర్గానికి పది మంది మాస్టర్ ట్రైనర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఎన్నికల్లో ఏ అక్రమం జరిగినా సి విజిల్ యాప్‌లో సత్వరమే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
source : eenadu.net
Discussion about this post