గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్‌లనూ ఏర్పాటు చేశామని, వాటిని సమర్థంగా వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఓటేసే అవకాశం కల్పించాలన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాతో కలిసి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో గురువారం ఆయన దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు అంశాలను సమీక్షించారు. ‘పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఓటర్లకు ఆటంకాలు సృష్టించొద్దు. ఈవీఎంలను తరలించే వాహనాలపై జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా నిఘా పెట్టాలి. పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే.. 11 తేదీ సాయంత్రం 6 గంటలకు డ్రై డే ప్రారంభమవుతుంది. దానిని పక్కాగా అమలు చేయాలి. రానున్న మూడు రోజులూ ఎంతో కీలకం. ఎంతో అప్రమత్తతతో ఉండాలి. అవాంఛనీయ ఘటనలు, ఓటర్లను ప్రలోభానికి గురిచేసే కార్యక్రమాలకు తావులేకుండా చూడాలి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి పర్యవేక్షించాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి’ అని మీనా ఆదేశించారు.
‘శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు విస్తరణ ప్రణాళికల్ని క్షేత్రస్థాయిలో పోలీసులు పటిష్ఠంగా అమలు చేయాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సకాలంలో స్పందిస్తూ.. తగు చర్యలు చేపట్టాలి. అనకాపల్లి, కృష్ణా, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి’ అని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సూచించారు.
source : eenadu.net
Discussion about this post