రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి చేతనైతే వైకాపా నుంచి వలసలు ఆపుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్ విసిరారు. శుక్రవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో వంద కుటుంబాలు తెదేపాలోకి చేరాయి. ఆత్మకూరు మండలం పి.యాలేరు, వై.కొత్తపల్లి గ్రామాల నుంచి 20 కుటుంబాలు, కనగానపల్లి మండలం కోనాపురంలో 15 కుటుంబాలు, నరసంపల్లి నుంచి 15, తగరకుంట నుంచి ఐదు, చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి నుంచి 15, రామగిరి మండలం దుబ్బార్లపల్లి, కొండాపురం గ్రామాల నుంచి ఐదు, అనంతపురం గ్రామీణం ఉప్పరపల్లి నుంచి 20 కుటుంబాలు సునీత సమక్షంలో చేరాయి. వీరందరికీ కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. అనంతరం పరిటాల సునీత మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఆయన సోదరులు పార్టీనే కాపాడుకోలేని వారు ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో గ్రామాల్లో పీఏబీఆర్ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధజలాలను అందించి తీరుతామని సునీత హామీ ఇచ్చారు. అనంతపురం గ్రామీణం పాపంపేట, పిల్లిగుండ్లకాలనీ, నందమూరినగర్, సుందరయ్య కాలనీ, జాకీర్‌కొట్టాల, రంగారెడ్డికాలనీ, గణేష్‌నగర్, భాగ్యనగర్, బసవతారకనగర్, వీకేనగర్, బిందెలకాలనీ, విద్యారణ్యనగర్లలో ప్రచారం నిర్వహించారు. జనం హారతులతో స్వాగతం పలికారు. కాలువలకు రక్షణ గోడల్లేక రెండేళ్ల కిత్రం గ్రామీణం ప్రాంత కాలనీలు జలమయ్యాయని, ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు సర్వం కోల్పోయినా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు.
source : eenadu.net
Discussion about this post