ఫుట్‌బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరకుండా, అలాగని అన్యాయం జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి నిర్ణయాలు వెలువడేలా చూడాల్సిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా నిష్క్రియాపరత్వంతో అధికార వైకాపాకు ప్రయోజనం చేకూరుతోందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిలు ఆ బాధ్యతల్లో ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగవని, వారిని బదిలీ చేయాలని ప్రతిపక్షాలన్నీ పదేపదే విన్నవిస్తున్నాయి. దీనిపై వాస్తవాల్ని ప్రతిబింబించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపి చర్యలు తీసుకునేలా చూడాల్సిన సీఈఓ మీనా.. ఆ బాధ్యతలేవీ సరిగ్గా నిర్వహించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ చేపట్టకుండా, వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ.. ఆ బురదను విపక్షాలపై చల్లే కుట్రను సీఎస్‌ను అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారు. సీఈఓ మీనా దీన్ని ఆపలేదు సరికదా.. పింఛన్ల వ్యవహారం తమ దృష్టిలో పరిష్కారమైపోయిన అంశమని ప్రకటించటమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుంటే.. సంబంధిత డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను వాటికి బాధ్యుల్ని చేస్తూ చర్యలు తీసుకోకపోవటంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. సీఈఓ ఇలా దేనికీ స్పందించకపోవడం ఎన్నికల సంఘం నిష్పాక్షికత, తటస్థతపై ప్రతిపక్షాలు, ప్రజల్లో అనేక సందేహాలకు దారితీస్తోంది.
ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో ఉదాహరణలతో సహా నివేదిస్తే ఈసీఐ నుంచి సానుకూల ఆదేశాలు పొందటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆ చొరవే సీఈఓ నుంచి కొరవడిందనేది విపక్షాల విమర్శ. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయడానికి అన్ని రకాల అవకాశాలున్నా అధికార యంత్రాంగం రెండు నెలలుగా అలా చేయట్లేదు. ఏప్రిల్ నెలలో మండుటెండల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను సచివాలయాల వద్దకు రప్పించారు. దానికి విపక్షాలే కారణమనే భావన ప్రజల్లో కల్పించి తద్వారా వైకాపాకు రాజకీయ ప్రయోజనం కలిగించాలనే కుట్రతోనే ఇలా చేశారు. దీంతో ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. 32 మంది వృద్ధులు చనిపోయారు. వీటన్నింటిపై ప్రతిపక్షాలు ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. మే నెలలోనైనా ప్రభుత్వోద్యోగులతో లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛను పంపిణీ చేయాలని కోరాయి.
అయినా ఎన్నికల సంఘం పాత ఆదేశాలనే పునరుద్ఘాటించింది తప్ప.. ఇంటి వద్దకు పింఛను పంపిణీ చేయాలని సీఎస్‌కు ఆదేశాలివ్వలేదు. మే నెల పింఛనును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దీంతో పింఛనుదారుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అభాగ్యులు మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిరగలేక, అక్కడ గంటల తరబడి నిరీక్షించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో ఏ బ్యాంకుకు వెళ్లి చూసినా ఈ కష్టాలేంటో కనిపిస్తాయి. పింఛను కోసం వెళ్లి రెండు రోజుల్లో పలువురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులను ఈసీఐ దృష్టికి తీసుకెళ్లి.. ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేసేలా సీఈఓ ఎందుకు చొరవ చూపడం లేదనేది ప్రధాన విమర్శ.
source : eenadu.net
Discussion about this post