జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా…ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. ఇక రెండు మూడు ఖాతాలున్న వారికి ఏ ఖాతాలో జమైందో వివరాలు బహిర్గతం చేయలేదు. దీంతో వారంతా పింఛను వస్తుందా? రాదా? అని సచివాలయాలకు వచ్చి వాకబు చేశారు. సచివాలయ సిబ్బంది నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల బ్యాంకుల్లో నగదు జమ చేశామనే సమాచారం కూడా పింఛనుదారులకు ఇవ్వలేదు. వారు గత నెల మాదిరిగానే పింఛను కోసం సచివాలయాలకు వచ్చారు. అప్పుడు బ్యాంకుల్లో నగదు జమైందంటూ చెప్పడంతో ఊసూరుమంటూ వెనుదిరిగారు. నగదు సకాలంలో పింఛనుదారుల చేతికి అందకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉందో ముఖ్యమంత్రి జగన్ అన్ని కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. మండుటెండల్లో వృద్ధుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఎంతో సులువైన విషయమైనా దాన్ని కావాలనే పక్కన పెట్టారు. గత నెల గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర పంపిణీ చేస్తే అక్కడ కూడా రెండు రోజుల్లోనే పూర్తయింది. ఈ సారి మాత్రం బ్యాంకుల్లో నగదు జమ చేసి మరిన్ని ఇక్కట్లకు గురిచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 65.49 లక్షల మంది పింఛనుదారులంటే బ్యాంకు ఖాతాలున్న వారు 48.92 లక్షల మంది అంటూ చూపించారు. ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాల్సిన పింఛనుదారులు 16.57 లక్షల మంది ఉన్నారంటూ తేల్చారు. ఇవన్నీ కాకిలెక్కలేనని తేలిపోయింది. నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచాన పడ్డవారి చాలా మంది పేర్లు ఇంటింటికీ పంపిణీ చేసే పింఛనుదారుల జాబితాలో లేవు. బ్యాంకు ఖాతాలు లేని వారి పరిస్థితీ ఇంతే. వారి పేర్లు విచిత్రంగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే వారి జాబితాలో వచ్చాయి. ఏ బ్యాంకులో నగదు జమైందో తెలుసుకుందామంటే ఆ వివరాలు మాత్రం సచివాలయాలకు పంపలేదు. బ్యాంకుల్లో జమవుతాయని ఒక జాబితా తయారు చేసి సచివాలయాల వారీగా పేర్లు మాత్రమే పంపారు. బ్యాంకుల వారీగా వివరాలు గురువారమో, శుక్రవారమో పంపుతామని సమాచారమిచ్చారు. బ్యాంకు ఖాతాలు లేని వారు, రెండు, మూడు ఖాతాలున్న వారు, ఖాతాలు మురిగిపోయిన వారు, పింఛను పరిస్థితి ఏమిటోనని 1వ తేదీనే గ్రామ, వార్డు సచివాలయాలను ఆశ్రయిస్తారని జగన్‌కు తెలియదా? అయినా వివరాలన్నీ సచివాలయాలకు పంపకుండా జాప్యం చేశారంటే..అది వృద్ధుల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్రే.
సాధారణంగా ప్రభుత్వం బ్యాంకుల్లో నగదు జమ చేసిన తర్వాత నిర్దేశిత ఖాతాలకు చేరిందో…లేదో సమాచారం తెలియడానికి 24 గంటలు పడుతుంది. ఇది బ్యాంకులో పనిచేసే క్లర్క్‌కు కూడా తెలుసు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన సాగించిన జగన్‌కి మాత్రం తెలియలేదు. నిజంగా పింఛనుదారుల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనే ఉంటే….ఎంత మంది ఖాతాలు మనుగడలో ఉన్నాయి? ఏ బ్యాంకు ఖాతాకు వారి ఆధార్‌కార్డు అనుసంధానమైంది? ఏ ఖాతాలో జమ చేస్తున్నాం? మురిగిపోయిన ఖాతాలెన్ని? వంటి వివరాలన్నీ పింఛను పంపిణీ కంటే ముందుగానే తెలుసుకుని లబ్ధిదారులకు తెలియజేసే వారు. ఏప్రిల్, మే నెల పింఛను పంపిణీ మధ్య నెల రోజుల గడువు ఉంది. అయినా ఈ కసరత్తేమీ చేయకుండా పింఛనుదారుల్ని ఇబ్బందులకు గురిచేసే కుట్రను అమలు చేశారు. మంగళవారం నాటికే పింఛనుదారుల సొమ్మును బ్యాంకుల్లో జమ చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఎంతమంది ఖాతాల్లో జమైందనేదానిపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం లేదు. బుధవారం సాయంత్రానికి 9 లక్షల మంది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమైనట్టు తెలుస్తోంది. అదే సమయానికి… మురిగిపోయిన ఖాతాల కారణంగా 75 వేల మంది పింఛనుదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. మొత్తం ఎంతమంది ఖాతాల్లో నగదు జమైంది? అది ఏ ఖాతాలో జమైంది? ఎన్ని ఖాతాలు మురిగిపోయాయి? అనే వివరాలు గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయంగానీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అప్పటివరకు పింఛనుదారుల్ని సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేయాలనే ఆలోచనే ఇది. ఎంతమంది బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదో లెక్క తేలిన తర్వాత వారి ఇళ్ల వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేస్తారు.
source : eenadu.net
Discussion about this post