జనాభా ప్రాతిపదికన బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నాం. బీసీ ఓటర్లతోనే జగన్మోహన్రెడ్డి గద్దెనెక్కారు. నమ్మిన బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చే ఎన్నికల్లో తాము కూటమికే మద్దతునిస్తామని స్పష్టం చేశారు. సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన తెదేపా అనంతపురం అర్బన్ కార్యాలయంలో దగ్గుపాటి ప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసమే తాము కూటమికి మద్దతు తెలిపామన్నారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రవిచంద్రకు ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. మరో సీనియర్ అధికారి రాజశేఖర్‌కు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా పోస్టింగ్ ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం సతాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీలు, పదోన్నతుల్లో బీసీలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లలో తీరని అన్యాయం చేశారని, తద్వారా పదవులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం పేదలందరికీ అందాలంటే సమర్థవంతమైన నాయకుడు ఒక్క చంద్రబాబేనన్నారు. తెదేపా, భాజపా, జనసేన పార్టీలు కలుసుకోవడం శుభపరిణామమన్నారు. దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. తెదేపా అధికారంలోకి రాగానే అనంత నగరంలోని పెద్ద గడియార స్తంభం వంతెనకు జ్యోతిరావుఫులె పేరు పెడతామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు.
source : eenadu.net
Discussion about this post