అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్‌కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న మీరు ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలలో సోమవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలు, పిఠాపురం రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. ‘మన భూములు దోచుకోవడానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాదరకమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొస్తున్నార[ు. దీని ప్రకారం మీ ఆస్తుల ఒరిజినల్ పత్రాలు జగన్ దగ్గర పెట్టుకుని యజమానులకు జిరాక్సులు మాత్రమే ఇస్తారు. మీ ఆస్తుల వివరాలన్నీ హైదరాబాద్ నానక్‌రామగూడలోని వైకాపా ప్రైవేటు స్థావరంలో దాచిపెడుతున్నారు. ఈసారి వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులను మీరే పెట్రోల్ పోసి తగలపెట్టుకున్నట్టే’ అని హెచ్చరించారు. ‘కేంద్రం ఇచ్చే పాస్‌పోర్టుపై కూడా ప్రధాని చిత్రం ఉండదు. దేశ రాజముద్ర మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో ప్రజల భూమి పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు?’ అని ప్రశ్నించారు. మీ పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఇప్పుడు పోరాడుతున్నానని యువతతో చెప్పారు. ‘జగన్ నాడు- నేడు పేరుతో విద్యావ్యవస్థను ఉద్ధరించారని చెబుతున్నారు. వైకాపా పాలనలో 4,709 పాఠశాలలు మూతపడ్డాయి. 3.9 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు. ఏపీలో 5-18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు 62 వేల మంది చనిపోయారు’ అని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే సీపీఎస్ సమస్యపై అసెంబ్లీలో బలమైన చర్చ జరిపి, పరిష్కారం కోసం పోరాడతామన్నారు.
source : eenadu.net
Discussion about this post