కాపు రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా 2014లో తునిలో జరిగిన రైలు దహనం వెనుక వైకాపా కుట్ర ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి తదితర నాయకులంతా కూర్చొని రిజర్వేషన్లు రావని తెలిసినా.. కాపు యువతను ఎగదోశారని దుయ్యబట్టారు. తుని దగ్గర ఉన్న కొబ్బరితోటల్లో కిరాయిమూకలను పెట్టి రైలు తగలబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆ కేసుల్లో అమాయకులైన యువత నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఉద్యమమైనా త్రికరణశుద్ధిగా చేయకపోతే అమాయకులు బలైపోతారనడానికి ఇదే నిదర్శనమన్నారు. మీకు అన్యాయం చేసిన ఈ నాయకులకు మళ్లీ ఓటేస్తారా అని ప్రశ్నించారు. కులాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని ప్రజలు గమనించాలని కోరారు. తాను ఆవేశంతో మాట్లాడతాను గానీ విధ్వంసం వైపు నడిపించనన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి, ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలలో ఆదివారం నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ ప్రసంగించారు.
‘కిర్లంపూడిలోని పెద్దలు (ముద్రగడ పద్మనాభాన్ని ఉద్దేశించి).. సినిమా నటులకు ఏం తెలుసని అన్నారు. ఆయన మీద సంపూర్ణ గౌరవం ఉంది. సినిమా నటులు మనుషులు కాదా? వారికి ప్రేమ ఉండదా? సామాజిక బాధ్యత ఉండదా? నేను సినిమాల్లోకి రావాలని అనుకోలేదు.. కుదిరింది అంతే’ అని అన్నారు.
‘యువతీ యువకులారా.. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి. మీరు సముద్రం లాంటివాళ్లు. సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. మీకు తుపానుకు ఉన్నంత బలం, పర్వతానికి ఉన్నంత శక్తి ఉంది. తుపాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవరికీ వంగి సలామ్ చేయదు. మీరందరూ మేమింతే అనుకోకండి. మీరు గొంతెత్తితే.. జగన్ ప్రభుత్వాన్ని ఈడ్చి బంగాళాఖాతంలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది. వైకాపాను చిత్తుగా ఓడించండి’ అని పవన్ పిలుపునిచ్చారు. ‘ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్ పాలనలో ఈ ఐదేళ్లలో మీ బతుకులు బాగుపడ్డాయా? వైకాపా ప్రభుత్వాన్ని మార్చాలా.. వద్దా’ అని ప్రజలను ప్రశ్నించారు. ‘అవును మార్చేద్దాం’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. వారి బంగారు భవిష్యత్తు కోసం కూటమి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నారు. ‘భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధి నుంచి జగన్ ప్రభుత్వం రూ.450 కోట్లు తీసేసుకుంది. కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమనిధి.. భవన నిర్మాణ కార్మికులకు చెందేలా చర్యలు తీసుకుంటా. ఎయిడెడ్ విద్యాలయాలు పునరుద్ధరిస్తాం’ అని హామీ ఇచ్చారు.
‘నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు రోడ్లమీదికి వస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు. కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి వెళ్లి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు. జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థులను గెలిపిస్తే.. అన్ని చేతులూ కలిసి ప్రభుత్వం ఏర్పాటైతే మీ కష్టాలు తీరతాయి. కూటమి అభ్యర్థులను గెలిపించండి’ అని కోరారు. ‘జగన్, మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిల కుటుంబాలు అడ్డగోలుగా దోచేస్తున్నాయి. మాఫియా డాన్ ద్వారంపూడితో పోరాడుతున్నాం. ప్రత్తిపాడు మండలం లంపకలోవ సమీపంలో ఆయన సోదరుడు వీరభద్రారెడ్డి కంపెనీ పెట్టి.. మట్టి, గ్రావెల్ అక్రమంగా తరలించి నిర్మాణం చేపట్టారు. మైనింగ్ సెస్‌తో కంపెనీ కోసం రోడ్డేసుకున్నారు. వంతాడ మైనింగ్‌లో అడ్డగోలుగా దోచేస్తున్నారు. లేటరైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వేస్తున్నారు. దీన్ని అడ్డుకుంటా’ అని చెప్పారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీ అందరికీ లోపల చాలా ఆవేశం ఉంది. ఈ ప్రభుత్వాన్ని తీసి చెత్తబుట్టలో పడేయండి. చలమలశెట్టి సునీల్ లాంటి వైకాపా అభ్యర్థులను ఓడించండి. కాకినాడ లోక్‌సభ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్, ప్రత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థులు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూలను గెలిపించండి’ అని పిలుపునిచ్చారు.
‘నేను కిర్లంపూడి వచ్చాను కాబట్టి కాపు రిజర్వేషన్ గురించి మీ ఆలోచన ఏంటని అడుగుతారు. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారంతా రిజర్వేషన్ కోరుకుంటారు. నేను కులనాయకుణ్ని కాదు. అందుకే ఇందులో కష్టాలేమున్నాయి? ఏం చేయగలమని ఆలోచిస్తాను. కాపులను తాకట్టు పెట్టేస్తున్నావ్ అని నాయకులు నన్ను విమర్శించారు. ఆ స్థాయి నాకుంటే ఓడిపోతానా? ప్రభుత్వం స్థాపించలేనా? ఆ వర్గంలో నేను పుట్టినా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post