ఎన్ని కూటములు కట్టినా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా ప్రకటించడాన్ని, అక్కడ రుషికొండలో కార్యాలయాన్ని నిర్మిస్తుండటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేశారంటూ… తన మద్దతుదారులందరికీ ఇదే నూరిపోస్తోంది. తాము గనుక గెలిస్తే అమరావతే రాజధాని అంటూ ఘంటాపథంగా చెబుతోంది కూడా. మరి అలాంటి పార్టీలో అత్యంత ముఖ్యుడైన నందమూరి బాలకృష్ణ… చంద్రబాబు తర్వాత పార్టీకి నెంబర్–2 స్థానంలో ఉన్న బాలకృష్ణ… ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు విశాఖలోని రుషికొండలోనే దాదాపు రూ. 65 కోట్లు పెట్టి భారీ స్థలం కొన్నారంటే ఏమనుకోవాలి? భవిష్యత్తు కనిపిస్తోంది కనక ఇప్పటికైనా జాగ్రత్తపడి స్థలం కొంటే భారీగా లాభపడవచ్చన్న అభిప్రాయం ఉండబట్టే కదా!!. దీనర్థం తెలుగుదేశం పార్టీ ఏ కోశానా గెలవదనే కదా?!.
నిజానికి ఎన్టీఆర్ తనయుడిగా… చంద్రబాబుకు వియ్యంకుడిగా… టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న బాలకృష్ణకు ఆస్తులకు కొదవలేదు. ఇప్పుడు కొనకపోయినా… ఎప్పుడైనా ఎక్కడ కావాలంటే అక్కడ స్థలాలు, భవనాలు కొనే ఆర్థిక స్తోమత ఆయనకుంది. కాబట్టి ఆయన ఎక్కడ ఏది కొన్నా దాన్ని పెట్టుబడిగానే భావించాలి. మున్ముందు మంచి లాభాలొస్తాయనే ఉద్దేశంతోనే కొంటారు. కాకపోతే 2019లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు అమరావతిలో ధరలు పెరిగి బాగా లాభం వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఎకరం స్థలం దాదాపు 6.5 కోట్లు పెట్టి కొన్నారు. కానీ ఆ తరవాత ఎన్నికలొచ్చి… చంద్రబాబు నాయుడు ఓడిపోవటం… రాజధానిగా ఆ ప్రాంతం సరైనది కాదని, అన్ని అర్హతలూ ఉన్న విశాఖపట్నాన్ని గనక రాజధానిని చేస్తే తక్కువ పెట్టుబడులుతో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భావించారు.
దానికి అనుగుణంగానే విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని పాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించారు. విశాఖలోని రుషికొండలో టూరిజం విభాగం కార్యాలయాన్ని కూడా నిర్మించింది. కాకపోతే రుషికొండలో కార్యాలయ నిర్మాణాన్ని, విశాఖను రాజధానిగా ప్రకటించడాన్ని తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ జీర్ణించుకోలేకపోతోంది. అమరావతిలో తమ రియల్ ఎస్టేట్ కలలు నిలువునా కూలిపోవటంతో విశాఖను రాజధానిగా ప్రకటించవద్దంటూ న్యాయస్థానాల్లో కేసులు వేసింది. ప్రతి స్థాయిలోనూ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా జగన్ సంకల్పం గట్టిది కావటంతో అవన్నీ వీగిపోతూ వస్తున్నాయి. రుషికొండ కార్యాలయాన్ని టూరిజం విభాగం ఆరంభించేసింది కూడా. ఈ నేపథ్యంలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి జగన్ ఇటీవలే జనం సాక్షిగా ప్రకటన చేశారు.
ప్రతి సర్వేలోనూ వైఎస్ జగన్ గెలుపు ఖాయమని వస్తుండటంతో పాటు తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చేస్తున్న సర్వేల్లోనూ వైసీపీ గెలుపు తథ్యమని తేలుతుండటంతో నందమూరి బాలకృష్ణ జాగ్రత్త పడ్డట్టు కనిపిస్తోంది. ఆయన వియ్యంకుడికి చెందిన గీతం కళాశాల కూడా సమీపంలోనే ఉండటంతో రుషికొండలోనే మంచి స్థలం చూడాలని ఈ ఏడాది జనవరిలో బాలకృష్ణ వారిని కోరినట్లు తెలిసింది. గతంలో ఆంధ్రాయూనివర్సిటీలో సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేసి… కొద్దికాలం గీతం వర్సిటీకి చైర్మన్‌గా కూడా పనిచేసిన విద్యావేత్త కోనేరు రామకృష్ణారావు కుటుంబీకులకు చెందిన స్థలం అక్కడ ఉండటంతో దాన్ని బాలకృష్ణ అల్లుడు డీల్ చేసినట్లుగా సమాచారం.
కోనేరు కుటుంబీకులంతా దాదాపుగా విదేశాల్లో ఉండటంతో వారికి చెందిన 10,255 చదరపు గజాల (2.15 ఎకరాలు) బీచ్‌రోడ్‌కు అభిముఖంగా ఉన్న స్థలాన్ని జనవరిలోనే బాలకృష్ణ రూ.65 కోట్లకు కొన్నారు. ఇందులో 1150 చదరపుటడుగుల చిన్న ఇల్లు కూడా ఉంది. స్థలం కొన్న విషయం బయటకు రాకుండా బాలయ్య అప్పటికప్పుడు తన కుటుంబానికే 100 శాతం షేర్లుండేలా ఎన్‌బీకే క్లాసిక్–2 అనే ఓ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ కంపెనీని ఏర్పాటు చేశారు. దాని పేరిటే భూమిని కొన్నారు. దీన్లో బాలకృష్ణకు వ్యక్తిగతంగా 25 శాతం… హెచ్‌యూఎఫ్ కర్తగా 30 శాతం; ఆయన భార్యాపిల్లలకు మిగిలిన 45 శాతం వాటాలున్నాయి. ఈ విషయాన్ని తాజాగా వేసిన ఎన్నికల అఫిడవిట్లో నేరుగా ఆయనే తెలియజేశారు. కాకపోతే ఇప్పటికిప్పుడు ఇంత హడావుడిగా బాలయ్య రుషికొండలో స్థలం కొన్నారని తెలిసిన రాజకీయ పరిశీలకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
source : sakshi.com
Discussion about this post