నందమూరి బాలకృష్ణ హిందూపురంలో నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్‌కు భారీ సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు తరలిరావడం జరిగింది. కాగా, బాలయ్య ఇప్పటికే హిందూపురం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
ఇక నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులను నిర్మించినట్లు పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా హిందూపురంలో రోజుకి 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తన కుటుంబం అంటే ఇక్కడి వారికి ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన.. ఆ అభిమానంతోనే తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ఈసారి కూడా భారీ మెజారిటీతో తనను గెలిపించాలని బాలకృష్ణ హిందూపురం ఓటర్లను అభ్యర్థించారు.
source : vaartha.com
Discussion about this post