మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిలపైన దుష్ప్రచారం చేయొద్దని కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తదితరులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తేల్చిచెప్పింది.
కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే మాట్లాడాలని కుండబద్దలు కొట్టింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరించింది. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, షర్మిల, సునీత తదితరులు తాము చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది. వీరు సీఎం వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డిలపై దుష్ప్రచారం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది.
రాజకీయంగా మైలేజీ కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు, మీడియా పబ్లిక్ కోర్టుగా అవతరించి న్యాయపాలనలో జోక్యం చేసుకుంటున్నాయని కడప జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు కడప ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి రెండు రోజుల క్రితం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
source : sakshi.com
Discussion about this post