మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. హిందూపురం పార్లమెంటు స్థానానికి రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ అరుణ్‌బాబు ఎన్నికల పబ్లిక్ నోటీసు విడుదల చేశారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆర్వోలు పబ్లిక్ నోటీసు విడుదల చేయగా.. ఉదయం 11 గంటలకు మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. బీ హిందూపురం పార్లమెంటు స్థానానికి వైకాపా అభ్యర్థి శాంత తరఫున లక్ష్మీనారాయణరెడ్డి ఒక సెట్ నామపత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. పుట్టపర్తి అసెంబ్లీ స్థానానికి తెదేపా తరఫున పల్లె సింధూరరెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, పల్లె వెంకటకృష్ణకిశోర్‌రెడ్డి, ధర్మవరం అసెంబ్లీకి వైకాపా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రాప్తాడు అసెంబ్లీకి ఇండిపెండెంటుగా రాజేశ్‌కుమార్, హిందూపురం అసెంబ్లీకి బీఎస్‌పీ అభ్యర్థిగా శ్రీరాములు నామపత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కలెక్టరేట్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్వో కేంద్రాల వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టారు.
source : eenadu.net
Discussion about this post