వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. బుధవారం మడకశిరలోని ఓ భవనంలో రొళ్ల, అగళి, గుడిబండ మండలాలకు చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి రాజీనామాను ప్రకటించారు. గుడిబండ మండలం సింగిల్‌విండో అధ్యక్షుడు చంద్రశేఖర్, మోరుబాగల్ ఎంపీటీసీ సభ్యుడు రాజు, వైకాపా తాలుకా యువత అధ్యక్షుడు రంగనాథ్, అమరాపురం మండలం వైకాపా జిల్లా కార్యదర్శి దేవరాజ్‌యాదవ్, రొళ్ల మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు, బూత్ కన్వీనర్ కేటీస్వామి, అగళి మండల సోషల్ మీడియా కో-కన్వీనర్ ఈరన్నలు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఐదుగురు వైకాపా నాయకులు అందరినీ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఇది నచ్చకనే పార్టీని వీడుతున్నామని అన్నారు. యాదవులకు వైకాపాలో తగిన న్యాయం జరగడం లేదన్నారు. అనంతరం వైకాపా కండువాలను కింద పడేసి పార్టీకి గుడ్ బై అంటూ నినాదాలు చేశారు.
source : eenadu.net
Discussion about this post