సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వానికి సర్వం సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తాం..అని కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ కేతన్‌గార్గ్, నగర కమిషనర్ స్వరూప్, అనంత పార్లమెంటు నియోజకవర్గ సహాయ ఆర్‌ఓ రమేశ్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ దాకా నామపత్రాల స్వీకరణ ఉంటుందన్నారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల పత్రాలను దాఖలు చేయవచ్చు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయడానికి వీలులేదు. నామపత్రాల దాఖలులో 13 రకాల పత్రాలను జత చేయాలి. పని దినాల్లో రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకే నామ పత్రాలు తీసుకుంటామన్నారు. నిమిషం ఆలస్యమైనా డిజిటల్ లాక్ పడుతుంది. నేరుగా నామినేషన్ వేయలేకపోతే.. సువిధ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు. దీన్ని ప్రింట్ తీసి..ఒక సెట్ దాఖలు ఇవ్వాలన్నారు.
లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.95లక్షలు, అసెంబ్లీ స్థానానికి రూ.40 లక్షల దాకా వ్యయ పరిమితి ఉంది. ఇంతకంటే పైసా ఎక్కువ ఖర్చు పెట్టినా తగిన చర్యలు తప్పవు. ఏ రోజుకారోజే ఖర్చు వివరాలను సంబంధిత ఆర్‌ఓలకు పంపాలన్నారు. ఇప్పటి దాకా జిల్లాలో రూ.2.5 కోట్లు సీజ్ చేశామన్నారు. ఇందులో 27 కేసులకు సంబంధించి రూ.67.56 లక్షలు నిర్దేశిత వ్యక్తులకు తిరిగి అప్పగించామని తెలిపారు. సి-విజిల్ యాప్‌నకు 374 ఫిర్యాదులు అందాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు.
source : eenadu.net
Discussion about this post