విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 23న ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలనిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ సమావేశాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల వార్షిక నివేదికలను ఆ రోజు తల్లిదండ్రులకు అందజేయాలని, ఏడాది పొడవునా విద్యార్థుల భాగస్వామ్యంపై చర్చించాలని ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. తల్లిదండ్రులు వందశాతం హాజరయ్యేందుకు చర్యలు తీసుకోవాలని, హాజరు ఆవశ్యకతను ఇప్పటినుంచే చెప్పాలని సూచించారు. ఓటర్లయిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్నికల సమయంలో సమావేశాలు ఎలా నిర్వహిస్తారన్నది చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పథకాల గురించి ఉపాధ్యాయులతో చెప్పించేందుకే దీన్ని నిర్వహిస్తున్నారని స్పష్టమవుతుంది. వారిని ప్రభావితం చేసేందుకే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెరవెనుక ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో నేరుగా తాను ఆన్‌లైన్‌లో పాల్గొంటానని ప్రకటించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఎలా చేస్తారన్న ప్రశ్నలతో ఇప్పుడు తన సందేశాన్ని వినిపించాలంటూ కొత్త ప్రచారం చేపట్టారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అప్పటికి పోలింగ్ పూర్తవుతుంది. అప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించుకోవచ్చు కదా? అన్న ప్రశ్నలొస్తున్నాయి.
source : eenadu.net










Discussion about this post