‘నిన్న జగన్‌పై పడింది చీకట్లో గులకరాయి. ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి. ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. ఆవలిస్తే పేగులు లెక్కపెడతా. నాకు రాజకీయాలు నేర్పిస్తారా జగన్? మీ సభలకు ప్రజలు రావడం లేదు, మీరంటే అసహ్యించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని బాధితులంతా ఒక్కటయ్యారు. రాష్ట్రంలో అందరం జగన్ బాధితులమే. నేనూ బాధితుడినే’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి విశాఖ జిల్లా గాజువాకలో ప్రజాగళం సభ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ‘ఇక్కడ రాళ్లు వేశారు… చూశారా? రేయ్ మీ అందరినీ ఈ ప్రజలు వదిలిపెట్టరు. రేపటి నుంచి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. పోలీసులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడికీ వచ్చింది. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, ప్రజలు తిరగబడి కొడతారు’ అని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. సీఎం జగన్‌పై విజయవాడలో రాయి విసిరిన తర్వాత జరిగిన పరిణామాలపై చంద్రబాబు తన ప్రసంగంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు.
‘మొన్న ఒక ఘటన జరిగింది, దాన్ని అందరం వ్యతిరేకించాం. విమానాశ్రయంలో నాకు సమాచారం రాగానే జగన్‌పై జరిగిన దాడిని ఖండించా. కానీ జగన్ అరగంటలోపే అక్కడే నా ప్లకార్డులు చూపించి, నేనే రాయి వేయించానని, దోషినని ప్రచారం చేశారు. మీ మీద గులకరాయి వేయించామా? మీ పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా రాజీనామా చెయ్యండి.. గంటలో పరిపాలన ఎలా చేయాలో చేసి చూపిస్తా. ఆ సత్తా, చేసి చూపించిన ట్రాక్ రికార్డు ఉన్నాయి. కోడి కత్తి డ్రామా చేసి, ఇప్పుడు ఎవరో గులక రాయి వేస్తే.. నేను వేయించానట. ఆ గులకరాయి వంకతో, నాపై రాళ్లు వేస్తారా? బాంబులు వేస్తేనే భయపడలేదు నేను. రాళ్లకు భయపడతానా?’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
source : eenadu.net
Discussion about this post