‘మీరేం ముఖ్యమంత్రి! బలప్రదర్శన కోసం వేల మంది ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తారా? మీ బస్సు యాత్రకు జనాలు విరగబడిపోతున్నట్లు చూపించేందుకు.. డ్రోన్ షాట్లు, ఫొటో, వీడియోషూట్ల చిత్రీకరణ కోసం గంటల తరబడి జాతీయ రహదారిని స్తంభింపజేస్తారా? మీ ‘ఎలక్షన్ షో’ కోసం ఎక్కడికక్కడ వాహనాలన్నింటినీ నిలిపేసి.. వాటిని ఒక్కసారిగా వదిలి వాహనదారుల్ని, సామాన్య ప్రయాణికుల్ని హింసిస్తారా? అసలు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత మీకుందా? మీ ప్రచారం కోసం ఇంత పైశాచికత్వమా?’
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి తాను ప్రయాణించే మార్గాల్లోని జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులను ఎక్కడికక్కడ స్తంభింపజేసి ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్న జగన్ శనివారం దాన్ని పరాకాష్ఠకు చేర్చారు. 14వ రోజు యాత్రను శనివారం గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ వద్ద నుంచి ఆయన మొదలుపెట్టారు. కాజా, మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి చేరుకుని భోజన విరామం కోసం ఆగారు. కనకదుర్గ వారధి మీదుగా సాయంత్రానికి విజయవాడలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో వారధిపైన డ్రోన్ షాట్లతో ఫొటో, వీడియో షూట్ పెట్టుకున్నారు. వారధి మొత్తం జనసందోహంతో నిండిపోయినట్లు డ్రోన్ వీడియో, ఫొటో షూట్లలో కనిపించేలా చేసేందుకు అంతకు ముందు గుంటూరు- విజయవాడ మధ్య జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్ నిలిపేశారు. దీంతో ఎండలో ప్రయాణికులకు, వాహనదారులకు నరకమేంటో అనుభవంలోకి వచ్చింది. ఈ ప్రభావంతో మొత్తంగా నాలుగు గంటలపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.
source : eenadu.net
Discussion about this post