‘మోసాల చంద్రబాబు నుంచి మన రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి గత 58 నెలలుగా జరిగిన మంచిని వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలు వివరించి స్టార్ క్యాంపైనర్లుగా చేయాలి. ఈ మంచి కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ రావాలి.. మోసపోకూడదంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి గడపకూ చెప్పాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి గుంటూరు శివారు ఏటుకూరు వద్ద నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి గ్రామానికి పౌర సేవలు, విద్య, వైద్యం, రైతన్న లకు భరోసా, అక్క చెల్లెమ్మలకు సాధికారత, అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సేవలు అందించిన మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా సిద్ధమేనా? గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను ఒక్క రూపాయి కూడా లంచం, వివక్షకు తావు లేకుండా 130 సార్లు బటన్ నొక్కి పారదర్శకంగా నేరుగా అందించిన ఈ ప్రభుత్వానికి, మీ జగన్‌కు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కేందుకు, మరో వంద మందికి చెప్పి నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా?
ఈ ఎన్నికల యుద్ధం కేవలం చంద్రబాబుకు, జగన్‌కు మధ్య జరుగుతున్నది కాదు. ఈ యుద్ధం బాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, వాటిని ఆపిన బాబు దుర్మార్గాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది వారి మోసాలకు, మన విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఆ అబద్ధాల బాబుకు ఇద్దరు వంత పాడుతున్నారు. ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు. 2014 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మోసగించిన బాబు ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ నమ్మబలుకుతున్నారు.
ఈ రోజు మీరంతా ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులతో కలసి ఒక్క అంశంపై ఆలోచన చేయమని కోరుతున్నా. మీ బిడ్డకు ఓటు వేయడం అంటే గత 58 నెలలుగా జరుగుతున్న మంచిని మీరందరూ కొనసాగించేందుకే ఓటు వేసినట్లే. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. ఈ 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని మీ అంతట మీరే మీకు వద్దని చెప్పినట్లేనని గుర్తుంచుకోవాలని కోరుతు న్నా.
58 నెలల క్రితం మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి ఫలానాది చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాడు. మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్ మాదిరిగా భావించి 99 శాతం హామీలను అమలు చేసి మీ ముందుకు వచ్చి మరోసారి ఆశీస్సులు కోరుతున్నాడు.
source : sakshi.com
Discussion about this post