రాయలసీమకు నీళ్లు ఇచ్చి రైతుల కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వాటిని విస్మరించి, భారతి సిమెంట్ పరిశ్రమకు ఏటా నీటిని తరలిస్తున్నారని భాజపా అభ్యర్థి సత్యకుమార్ విమర్శించారు. ఆదివారం సత్యకుమార్, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌తో కలిసి తాడిమర్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, పంచ భూతాలను మింగేశారని, ఎన్నికల తరువాత అన్నింటినీ బయటకు తీసి రాజమండ్రి జైల్లో ఖైదీగా బెర్తు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో వైకాపా నాయకుల అరాచకాలకు ఎందరో పేదలు బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా తాడిమర్రి ప్రధాన రహదారి విస్తరణ పేరుతో వందల భవనాలను కూల్చివేసి బాధితులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను స్థానికంగా కొన్ని సందర్భాల్లో లేకపోయినా పరిటాల శ్రీరామ్ శాశ్వతంగా ఇక్కడ ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాడిమర్రి విశ్రాంత ఏఎస్‌ఐ శ్రీరాములు, రాముడు తదితరులు భాజపాలో చేరారు.
source : eenadu.net
Discussion about this post