ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మళ్లీ గెలవటం కష్టమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత వైకాపా రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఓ మోనార్క్‌లా జగన్ పాలన కొనసాగిస్తున్నారని పీటీఐ సంపాదకులతో జరిగిన ముఖాముఖిలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే ఆయన పాలనతో రాష్ట్రానికి ఒనగూరిందేమీ లేదని అన్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌లా తాయిలాలివ్వడం తప్ప.. ప్రజల ఆకాంక్షలను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. నగదు బదిలీ మాత్రమే చేశారని.. ఉద్యోగాల కల్పనపైన, అభివృద్ధిపైన ఏమాత్రం దృష్టి సారించలేదని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. జగన్ విషయంలోనూ అదే జరగనుందని అభిప్రాయపడ్డారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయావకాశాలపై మాట్లాడుతూ.. ఆ పార్టీ 300కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతంలో కమలదళం మెరుగైన ఫలితాలను సాధిస్తుందని అన్నారు. తెలంగాణలో భాజపా తొలి లేదా ద్వితీయ స్థానంలో నిలవొచ్చని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు. ‘‘ఒడిశాలోనైతే భాజపా నంబర్‌వన్‌గా నిలుస్తుంది. నా అంచనా ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోనూ అత్యధిక సీట్లు సాధిస్తుంది. తమిళనాడులోనూ ఆ పార్టీ ఓట్ల శాతం రెండంకెలకు చేరుకుంటుంది’’ అని పేర్కొన్నారు. అయితే 370 సీట్లు సాధించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
source : eenadu.net
Discussion about this post