తెదేపా అధినేత చంద్రబాబును ఉద్దేశించి శాడిస్టు, పశుపతి, చంద్రముఖి అంటూ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిత్వ హననం, రెచ్చగొట్టేలా ఉన్న ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా ఆదివారం నోటీసులు జారీ చేశారు. కోడ్ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయా వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్‌ను ఆదేశించారు. గడువులోగా స్పందించకపోతే ‘మీరు చెప్పడానికి ఏమీ లేదని భావించి’ ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని హెచ్చరించారు. చంద్రబాబుపై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ నెల 5న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన సీఈవో తదుపరి చర్యలకు ఆదేశించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వివరిస్తూ.. ఈసీ వెలువరించిన పత్రికా ప్రకటనలోని 47వ పేరాలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన మార్గదర్శకాల్ని స్పష్టంగా పేర్కొన్నట్లు ముకేశ్‌కుమార్ మీనా గుర్తుచేశారు. ‘‘ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వం, ప్రవర్తనపై దాడి చేయడం, వారి హుందాతనాన్ని దెబ్బతీసేలా వ్యంగ్యంగా మాట్లాడటం, వారికి దురుద్దేశాలు ఆపాదించడం వంటి చర్యలు కోడ్‌ను ఉల్లంఘించడమే. ఇలాంటి వాటిని ఈసీ నిషేధించింది. ఈ విషయంలో సంయమనం పాటించాలని అభ్యర్థుల్ని హెచ్చరించింది. ఆయా నిబంధనల్ని వివరిస్తూ మార్చి 1న ఈసీ అన్ని రాజకీయ పార్టీలకూ లేఖలు రాసింది. వాటిని జగన్ ఉల్లంఘించినట్లు వర్ల రామయ్య సమర్పించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది’’ అని ముకేశ్‌కుమార్ మీనా పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post