‘ధర్మవరంలో ఐదేళ్లుగా రాక్షస పాలన సాగుతోంది. నేను దైవ సంకల్పంతోనే ఇక్కడి వచ్చా. అరాచకపాలన లెక్కతేల్చి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ధర్మవరం పొలిమేర వరకు తరిమికొడతా..’ అని భాజపా(కూటమి) అభ్యర్థి సత్యకుమార్ పేర్కొన్నారు. గురువారం ధర్మవరం వచ్చిన సత్యకుమార్‌కు తెదేపా, భాజపా శ్రేణులతోపాటు బీసీ వర్గాలకు చెందిన పలువురు ఘన స్వాగతం పలికారు. హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ కలిసి ఆయన పట్టణంలోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం భారీ ప్రదర్శనను ప్రధాన రహదారి మీదుగా ఎన్టీఆర్ కూడలి వరకు నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సత్యకుమార్ మాట్లాడుతూ ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం నాశనమైందని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దుర్మార్గ పాలన చేశారని దుయ్యబట్టారు. ధర్మవరంలో అన్ని వ్యవస్థలను ఎమ్మెల్యే తన గుప్పెట్లో పెట్టుకుని, ప్రజలను ఇబ్బందులు గురుచేస్తున్నారని ఆరోపించారు. ‘ఎమ్మెల్యే అవినీతి కోటలు కూల్చడానికే నేను వచ్చా. రాయలసీమ బిడ్డనే.. ఎందులోనూ వెనక్కు తగ్గేదేలే..’ అని స్పష్టం చేశారు. గుడ్‌మార్నింగ్ పేరుతో ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. చేనేతలకు అన్ని విధాలా అండగా నిలుస్తాననన్నారు. ఐదేళ్లు ధర్మవరంలో ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. బీకే పార్థసారథి మాట్లాడుతూ వైకాపా పాలన అంతమొందించేందుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరం అభివృద్ధి బాధ్యత ఆయన తీసుకుంటారన్నారు.
source : eenadu.net
 
	    	 
                                









 
                                    
Discussion about this post