వివేకా హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేస్తూ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిసినప్పుడు నిందితుడైన వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలును రద్దు చేయాలని మీరెందుకు కోరలేదంటూ సీబీఐని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. తనను బెదిరిస్తున్నారని డిసెంబరులో దస్తగిరి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఏం చేశారని నిలదీసింది. దస్తగిరిని పక్కనపెడితే ఏం జరుగుతుందో మీకు తెలియదా అంటూ ప్రశ్నించింది. ఈ కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిలును రద్దు చేయాలని కోరుతూ మరో నిందితుడు, అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. దస్తగిరి తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ నిందితుడు అవినాష్‌రెడ్డి హైకోర్టు బెయిలు షరతులను ఉల్లంఘించారన్నారు.
అవినాష్‌రెడ్డి అనుచరులు దస్తగిరి తండ్రిపై దాడి చేసి, గాయపరిచారన్నారు. నిందితులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే మీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవని దస్తగిరిని బెదిరించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడిగా ఉన్నారా అని ప్రశ్నించగా లేదని న్యాయవాది సమాధానమిచ్చారు. సాక్షులకు రక్షణ అవసరమని, లేదంటే సాక్ష్యాలను తారుమారు చేయగలరని శ్రావణ్‌కుమార్ చెప్పారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెబితే రూ.20 కోట్లు ఇస్తామంటూ నిందితుడైన శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి దస్తగిరికి ఆఫర్ చేశారని న్యాయవాది తెలిపారు. డాక్టర్ అయిన చైతన్యరెడ్డి జైలులో వైద్యశిబిరం పేరుతో వచ్చి రూ.20 కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామని, మీ కుటుంబానికి ఉద్యోగంతోపాటు బాగోగులు చూసుకుంటామని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురోవాల్సి ఉంటుందని దస్తగిరిని హెచ్చరించారన్నారు. బెయిలు షరతులను ఉల్లంఘించినందున బెయిలు రద్దు చేయాలని కోరారు.
మూడో వ్యక్తికి అర్హత లేదు
అవినాష్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దస్తగిరి రక్షణ కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ప్రత్యామ్నాయాలపై నిర్ణయం రాకుండానే ఇక్కడ పిటిషన్ వేయడం సరికాదన్నారు. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలును రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించలేదన్నారు. బెయిలు రద్దు కోరే అర్హత మూడో వ్యక్తికి లేదని ఓ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్‌లో ఇదే హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. కిరాయి హంతకుడైన దస్తగిరికి ఎమ్మెల్యేకంటే ఎకువగా 3+ 3 భద్రత ఉందన్నారు. దస్తగిరి తరఫు న్యాయవాది స్పందిస్తూ బెయిలు రద్దు కోరుతూ బాధితులు, ఇతరులు కూడా పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు.
న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సీబీఐ నిర్ణయమేంటని అడిగారు. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు రద్దు చేయాలన్న దస్తగిరి వాదనను సమర్థిస్తున్నామని సీబీఐ తరఫు న్యాయవాది చెప్పారు. అలాంటప్పుడు అవినాష్‌రెడ్డి బెయిలు రద్దు చేయాలని మీరు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సీబీఐని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీబీఐ ప్రభుత్వ సంస్థ అని, అనుమతులన్నీ రావడానికి కొంత సమయం పడుతుందని, ఈలోగా వివేకా కుమార్తె ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారని, అందులోనే బెయిలు రద్దు చేయాలని కోరుతూ తాము కౌంటరు దాఖలు చేయనున్నామని సీబీఐ న్యాయవాది తెలిపారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లతో దీనికి సంబంధం లేదన్నారు.
నిందితులతో జైలు అధికారులు కుమ్మక్కయ్యారని సీబీఐ న్యాయవాది తెలిపారు. జైల్లో ఉన్న దస్తగిరిని కలవడానికి నిందితుల సంబంధీకుణ్ని అనుమతించారని తెలిపారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు సాక్షులను ప్రభావితం చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు. వివేకా హత్య కేసులో నిందితులైన వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలు దాఖలు చేసిన బెయిలు పిటిషన్లపై విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు.
source : eenadu.net
Discussion about this post