‘విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపు.. నిజం ఒకవైపు, అబద్ధం మరో వైపు.. ఇంటింటి ప్రగతి ఒకవైపు, తిరోగమనం మరోవైపు.. ప్రతి ఇంట్లో అభివృద్ధి ఒకవైపు, అసూయ మరో వైపు.. మంచి ఓవైపు, చెడు మరో వైపు.. వెలుగు ఓ వైపు, చీకటి మరో వైపు.. ధర్మం ఓ వైపు, అధర్మం మరోవైపు.. ఇలా విశ్వసనీయత, మోసం అనే రెండింటిలో ఎటు వైపు మొగ్గాలన్న దానిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ధర్మాన్ని గెలిపించాలి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు.
ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదని, ఒక హాబిట్చువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. ఈ యుద్ధంలో మీ బిడ్డ జగన్ ప్రజల పక్షం అని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. బుధవారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగిన మనమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఏడవ రోజు ఆయన చిత్తూరు జిల్లా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి, ఇంటింటి అభివృద్ధి, ఇంటింటికి మంచి, పిల్లల భవిష్యత్తు కోసం పరితపిçస్తూ మనందరి ప్రభుత్వం ఓవైపు ఉంటే.. ఒకసారి కాదు.. గతంలో మూడుసార్లు అధికారంలో ఉన్నా కూడా.. అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటినే ప్రజలకు రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ల ఎదుటే కనిపిస్తోందన్నారు.
ఈ యుద్ధంలో చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర ప్రజలను వ్యతిరేకించే పక్షంగా చంద్రబాబు పక్షాన నిలిచారని చెప్పారు. మీ బిడ్డ ఒక్కడిపై వీరందరూ యుద్ధం చేస్తున్నారని, ఈ యుద్ధంలో ధర్మాన్ని గెలిపించడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలిపించుకుని డబుల్ సెంచరీ సర్కార్‌ను స్థాపిద్దామని చెప్పారు.
source : sakshi.com
Discussion about this post