‘టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. వాళ్లను ఫాలో అవ్వండి’ అని తన పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సూచించారు. పిఠాపురం పర్యటనను ఆదివారం అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన ఆయన.. సోమవారం మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా జనసేన నేతలతో సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
జనసేన నేతలందరూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఆధ్వర్యాన ఆ పార్టీ నాయకులతో కలిసి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరుతో ఫొటో దిగాలని ఉందని, పరిస్థితులు అనుకూలించగానే రోజుకు 200 మందితో ఫొటోలు దిగాలని భావిస్తున్నట్టు తెలిపారు.
తన విజయం కోసం స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మెజారిటీ ఎంత తీసుకురావాలనేది వారిపైనే వదిలేస్తున్నానని, వారు పడే కష్టం మీదే తన మెజారిటీ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రైల్వే కోడూరు అభ్యర్థి అరవ శ్రీధర్, పాలకొండకు చెందిన నిమ్మక జయకృష్ణ తదితరులు జనసేనలో చేరారు.
సాయంత్రం పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అంతా టీడీపీ నేతలతోనే అని పవన్ అంటుంటే.. ఇక తామెందుకు అంటూ జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి పనిచేస్తుంటే ఎవరి కిందో పని చేయాలనడం ఎంత వరకూ సమంజసమంటూ పవన్ తీరుపై వారు రుసరుసలాడుతున్నారు.
source : sakshi.com
Discussion about this post