నెట్టికంటి ఆంజనేయస్వామి, అల్లా సాక్షిగా తాము ఎవరికీ ఎలాంటి అపకారం చేయమని గుంతకల్లు తెదేపా అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. టికెట్ ప్రకటించిన తర్వాత ఆదివారం ఆయన మొదటిసారి గుంతకల్లుకు వచ్చారు. రోడ్‌షో నిర్వహించి రాత్రి వాల్మీకి కూడలిలో ప్రసంగించారు. వైకాపా ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డితో పాటు మరికొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. తాము ఆలూరు నియోజకవర్గంలో ఎవరిపైనా దౌర్జన్యం చేయలేదన్నారు. దోనిముక్కల ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలు చేసిన స్థలాలను తాము అధికారంలోకి వస్తే స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామన్నారు. బళ్లారి రోడ్డు పక్కన ఉన్న కొన్ని స్థలాలను ఎమ్మెల్యే అక్రమంగా తన కుమార్తె పేరు మీదుగా తీసుకున్నారని ఆరోపించారు. జూదం విషయంగా తనపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. తనకు టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే భయపడిపోతున్నారని, ఫ్యాన్ అడ్రస్ లేకుండా పోతుందని తెలిపారు. కూటమి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
source : eendu.net
Discussion about this post