రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏప్రిల్ 1వ తేదీన కదిరిలో పర్యటించనున్నట్లు వైఎస్సార్ సీపీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 1న కదిరికి రానున్న సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు పట్టణంలో రోడ్‌షో నిర్వహించడంతో పాటు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. అనంతరం స్థానిక పీవీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారన్నారు.
టీడీపీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ తనను నాన్‌లోకల్ అని ఆరోపించారని, వాస్తవానికి ఆయనే నాన్‌లోకల్ అని మక్బూల్ పేర్కొన్నారు. తాను కదిరిలో పుట్టి, కదిరిలోనే చదువుకున్నానని తెలిపారు. పట్టణంలోని ప్రతి వీధిలో మిత్రులతో కలిసి ఆడుకున్నానని గుర్తు చేశారు. కానీ కందికుంట వాళ్ల నాన్న ఉద్యోగ రీత్యా కదిరికి వచ్చారని, అలాంటప్పుడు ఆయన లోకల్ ఎలా అవుతారని ప్రశ్నించారు. కదిరిలో ముచ్చటగా మూడోసారి వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కందికుంటకు మరోసారి ఓటమి తప్పదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, పార్టీ నియోజక వర్గ మాజీ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు జిలాన్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post