సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు తెదేపా అభ్యర్థుల నియామకం తుది జాబితాను శుక్రవారం విడుదల చేశారు. దీంతో అభ్యర్థుల నియామకం పూర్తి అయింది. అనంతపురం జిల్లాలో రెండు ఎమ్మెల్యే స్థానాలకు, ఒక ఎంపీ స్థానం అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం నియమించారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ నియమించారు.కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి తొలుత కందికుంట ప్రసాద్ భార్య యశోదాదేవి పేరు ప్రకటించారు. తాజా సర్దుబాట్లలో ఆయన పేరునే ప్రకటించారు.
ఈయన అంబికా గ్రూపు ఆఫ్ ఫర్మ్స్‌కు అధిపతి. 2009లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. గత తెదేపా హయాంలో అహుడా ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అంబికా ఫౌండేషన్ ఛైర్మన్‌గా, వాల్మీకి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మహర్షి వాల్మీకి భవన్ అధ్యక్షుడిగా, రోటరీ క్లబ్ సభ్యులుగా, మాజీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ది వ్యవసాయ కుటుంబం. రాప్తాడు మండలం ఎం.బండమీద పల్లి స్వస్థలం. 2014-19 వరకు రాప్తాడు మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి జిల్లా ఎంపీపీల అసోసియేషన్ అధ్యక్షుడిగాను, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఛాంబర్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జాతీయ స్థాయిలో ఎంపీపీ అవార్డు అందుకున్నారు. స్వగ్రామంలో ప్రజలకు ఉచితంగా శుద్ధ నీరు పంపిణీ, సీఎస్‌ఆర్ పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలు, నిధులు సమీకరించి పోలీసు సంక్షేమ కార్యక్రమాలు, ఎం.బండమీదపల్లిలో దళితులకు ఇంటి పట్టాలు పంపిణీ, గ్రామంలో వైద్య ఆరోగ్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
గుమ్మనూరు జయరాం స్వస్థలం కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరు. వ్యవసాయ కుటుంబం. 2006లో చిప్పగిరి మండలం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో ప్రజా పార్టీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2014లో వైకాపాలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి కార్మికశాఖ మంత్రిగా కొనసాగారు. ఈసారి వైకాపా టికెట్ రాక తెదేపాలో చేరారు. మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ అయ్యారు.ఇటీవల చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరగా గుంతకల్లు అభ్యర్థిగా పేరు ప్రకటించారు.
2004లో అసెంబ్లీ ఎన్నికల్లో కదిరికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజితులయ్యారు.ఆ తర్వాత తెదేపా తరఫున 2009లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఆ తర్వాత 2014, 2019లోనూ తెదేపా అభ్యర్థిగానే ఎన్నికల బరిలో దిగి ఓటమి పొందారు.
source : eenadu.net
Discussion about this post