‘‘వైకాపా పాలనలో రాష్ట్రాన్ని గంజాయి, ఇసుక మాఫియా, డ్రగ్స్, కల్తీ మద్యం, హత్యలు, అత్యాచారాల్లో ముందు వరుసలో నిలిపి తెలుగు వారి పరువు తీస్తున్నారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలో 30,196 మంది మహిళలు కనిపించకుండా పోయారు. రాష్ట్రాభివృద్ధికి పరితపించే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని ఆకాంక్షిస్తున్నా’’ అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో శుక్రవారం ఆమె ‘నిజం గెలవాలి’ యాత్ర చేపట్టారు. తొలుత ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరును భువనేశ్వరి సందర్శించారు. అక్కడి నుంచి మచిలీపట్నం చేరుకున్నారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా స్థానిక నోబుల్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మచిలీపట్నం 23వ వార్డులో మృతి చెందిన కార్యకర్త సోమయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం కోన గ్రామం వెళ్లి మరో కార్యకర్త పిట్ల బసవయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కోనలో గంగపుత్రులతో మాటామంతీలో పాల్గొన్నారు. ఘంటసాల మండలం తాడేపల్లిలో కొడాలి సుధాకరరావు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. చంద్రబాబు భరోసా పత్రాన్ని బాధిత కుటుంబానికి భువనేశ్వరి అందించారు. తర్వాత అక్కడి నుంచి మొవ్వ మండలం కూచిపూడి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడారు.
source : eenadu.net
Discussion about this post