జెండాలు జత కట్టాయి.. నేతలు కూటమిగా ఏర్పడ్డారు.. సీట్లు పంచుకున్నారు.. అభ్యర్థులను ఖరారుచేశారు.. కానీ, అసలైనది అయిన సహకారం వీరి మధ్య కరువైంది. ప్రధానంగా మిత్రపక్షాల నుంచి టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీకి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు.. తమకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని జనసేన కార్యకర్తలూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల పెద్దలు కలుసుకునేందుకు మాత్రమే కూటమి వేదికగా మారినట్లు స్పష్టమవుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. కూటమిలో టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఎవరికి వారు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం పార్లమెంటు సీటుతో పాటు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో వేరు కుంపట్లు ఉంటాయని చెబుతున్నారు. మూడు పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారుగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ తరఫున ధర్మవరం టికెట్ ఆశించిన వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ)కి కూడా నిరాశే ఎదురైంది. బీజేపీ అధిష్టానం ధర్మవరం టికెట్‌ను వై. సత్యకుమార్‌కు ఖరారు చేసింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్ హస్తం ఉందని భావిస్తున్న సూరి తనకు టికెట్ రాకుండా టీడీపీ అధిష్టానం వద్ద అడ్డుపుల్లలు వేసిన పరిటాల కుటుంబ సభ్యులను ఓడించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. పరిటాల సునీతను ఓడించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
హిందూపురం ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేస్తానని రెండు నెలలుగా పరిపూర్ణానందస్వామి ప్రచారం చేసుకున్నారు. అయితే, కూటమిలో భాగంగా టీడీపీ నేత బీకే పార్థసారథికి ఆ ఎంపీ టికెట్ ఖరారుచేశారు. కానీ, పరిపూర్ణానందస్వామి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని.. కార్యకర్తలు అందరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ–జనసేన తనను మోసం చేశాయని ఆయన మండిపడుతున్నారు.
source : sakshi.com
Discussion about this post