‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. గోప్యత అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడూ గతంలో ఎవరికి ఓటు వేశారు? వారి సామాజిక నేపథ్యం, వృత్తి వంటి అన్ని వివరాలను ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సేకరించింది. ఇది నేరపూరితమైన కుట్ర. పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమే. రాజ్యాంగం సమాన హక్కులు కల్పించినా పోలీసు వ్యవస్థ మాత్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. దేశ ప్రధాని నరేంద్రమోదీ హాజరైన సభకు సరైన భద్రత కల్పించకపోవడమే దీనికి నిదర్శనం. సభ అనంతరం ఇద్దరు తెదేపా కార్యకర్తలను వెంటాడి, వేటాడి చంపడం మరో సాక్ష్యం.
రాష్ట్రంలో స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు కూడా లేవు. సాంకేతిక పరిజ్ఞానంతో తిరుపతిలో 35వేల దొంగ ఓట్లు వేశారు. ఇలా పలు కారణాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితిలో పడింది’ అని మాజీ ఎస్‌ఈసీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ‘స్వేచ్ఛాయుత ఎన్నికలు- అవినీతికి అడ్డుకట్ట’ అంశంపై శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
‘రానున్న ఎన్నికలు హింసాయుత వాతావరణంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. క్షీణిస్తున్న భద్రతా వ్యవస్థ, పౌరుల్లో నెలకొన్న ఆందోళనలతోº స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగవని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశాం. పౌరులతో వాలంటీర్లను దూరం చేస్తేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి’ అని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు.
‘ఎక్కడైతే మానవహక్కుల ఉల్లంఘన, ఎన్నికల్లో పారదర్శకత లోపిస్తుందో అక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఎన్నికల చట్టం ప్రకారం తాయిలాలు ఇవ్వడం, తీసుకోవడం, ఇస్తామని హామీ ఇవ్వడం కూడా నేరమే. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి దాదాపు రూ.50 కోట్లు, ఎంపీ అభ్యర్థి రూ.350 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నారు. గెలిచాక దానికి 10 రెట్లు ఎక్కువ దోచుకోవడానికే అంతలా ఖర్చు చేస్తారు. అయినా వారిపై ఎందుకు అనర్హత వేటు వేయడం లేదంటే.. దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలూ ఈసీ దగ్గర ఉండవు. అభ్యర్థులు వారి బ్యాంకు ఖాతాలు, ఖర్చు పెట్టిన సొమ్ము తాలూకు సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. అందుకే వారిని అనర్హులుగా ప్రకటించరు. యువత, మీడియా బాధ్యతగా తీసుకుని ఆ ఆధారాలను సేకరించి ఈసీకి సమర్పించాలి’అని ఈసీఐ ఎన్నికల వ్యయాల పూర్వ డీజీ పీకే డాష్ పేర్కొన్నారు. ‘ఎన్నికలు ఎప్పుడైతే స్వేచ్ఛగా జరుగుతాయో అప్పుడే ప్రజాభిప్రాయం వెల్లడయ్యే అవకాశం ఉంది. దేశంలో దానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి’ అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.
source : eenadu.net
Discussion about this post