ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఒకవైపు తొలగిస్తుంటే.. వైకాపా నాయకులు బరితెగించి ‘వాలంటీర్లూ.. వచ్చి పార్టీ సేవలో తరించండి’ అని ఎన్నికల ప్రవర్తనా నియమావళినే అపహాస్యం చేస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘వైకాపాపై అభిమానం ఉన్న వాలంటీర్లు స్వచ్ఛందంగా ఆ పదవుల నుంచి తప్పుకోండి. పూర్తిగా పార్టీకి అంకితంకండి. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు మీ పోస్టులు మీకే ఇస్తాం’ అని హామీ ఇచ్చారు.
రాజమహేంద్రవరం నగర అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, ఎంపీ భరత్ ఇంకా తెగించి.. నగర పరిధిలో తొలగించిన 23 మంది వాలంటీర్లకు ఉద్యోగాలిస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి దినేష్‌కుమార్ గురువారం వాలంటీర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. దీనిపై శుక్రవారం ఎంపీ విలేకర్లతో మాట్లాడారు. ‘తెదేపా నాయకుల ఫిర్యాదులతో వాలంటీర్లను తొలగించడం బాధాకరం. నేను ఇంటింటి ప్రచారంలో భాగంగా వాలంటీర్ల ఇళ్లకు వెళ్లి ఓటు అభ్యర్థించాను. అంతేగానీ వాలంటీర్లు ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారమైనా చూపగలరా. దీనిపై విచారణ జరిపి.. తొలగించిన వాలంటీర్లకు న్యాయం చేయమని ఆర్వోకు లేఖ రాస్తా. లేకుంటే వాలంటీర్లకు నేనే మంచి ఉద్యోగాలు ఇప్పిస్తా’ అని ఎంపీ చెప్పడం గమనార్హం. విశాఖ కేంద్రంగా జరుగుతున్న చీకటి వ్యాపారాల వెనక తెదేపా నాయకులు ఉన్నారని ఎంపీ ఆరోపించారు.
source : eenadu.net
Discussion about this post