టిడిపి-జనసేన-బిజెపి నిర్వహించిన తొలి ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం నిరాశ పరిచింది. రాష్ట్ర ప్రజలతోపాటు టిడిపి-జనసేన కార్యకర్తల్లో కూడా అసంతృప్తి నెలకొంది. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా ఊసే లేదు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం, విశాఖరైల్వే జోన్ వంటి అంశాలపై పల్లెత్తు మాట కూడా అనలేదు. టిడిపి, అధినేతలను పొగడటం ఎన్‌డిఎ కూటమికి ఓటేయాలని పదేపదే అనడం తప్ప కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సహకారం అందిస్తామనే అంశం ప్రస్తావించలేదు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను మోడీ, చంద్రబాబు, పవన్ ప్రకటిస్తారని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురుచూశారు. అయితే అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లే రాష్ట్రానికి ఇస్తున్న జల్‌జీవన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను తాము రాష్ట్రంలో అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొచ్చారు. గత పదేళ్ల నుంచి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేకపోయారు. ఇరు పార్టీల అధినేతలు వైసిపి అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడానికే పరిమితమైపోయారు. 2018లో ఎన్‌డిఎ కూటమి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుపై మోడీ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. పోలవరాన్ని ఎటిఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఎన్‌డిఎతో పొత్తు ఖరారైన తరువాత వైసిపి అధినేతపై కూడా మోడీ అలానే విమర్శలు చేస్తారని భావించారు. కానీ జగన్‌ను ఒక్క మాట కూడా అనలేదు. కాంగ్రెస్‌పై ఎప్పటిలాగే విమర్శలు చేశారు.
మోడీని చంద్రబాబు, పవన్ పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రానికి ఏమి కావాలో ఇద్దరూ మోడీ ముందు మాట్లాడలేకపోయారు. ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని కోరారు గానీ విభజన హామీలు, హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, రాజధాని నిర్మాణం, పోలవరం అంశాల గురించి కనీసం ప్రస్తావించలేదు.
కూటమి సభ బాగా జరిగిందని, ప్రజల్లో ఉత్సాహం కనిపించిందని ప్రధాని మోడీ అన్నారు. బొప్పూడి సభ అనంతరం ప్రధాని మోడీతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు, ఆయన ఆరోగ్యంపైనా మోడీ అడిగినట్లు తెలిసింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ప్రధానికి చంద్రబాబు, పవన్ మోడీకి వివరించారు.
source : prajasakthi.com
Discussion about this post