ఎవరేమనుకున్నా సరే మేమింతే.. మారమంతే.. అన్నట్లుంది అధికార పార్టీ నాయకుల తీరు. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం వైఎస్సార్ కూడలి వద్ద ప్రధాన రహదారిపై ఆదివారం వైకాపా ఎన్నికల ప్రచారసభ నిర్వహించారు. ఒకవైపు రహదారిని పూర్తిగా బంద్ చేశారు. ఆర్‌అండ్‌బీ రహదారిపై వేదిక, సభకు వచ్చినవారు కూర్చునేందుకు కుర్చీలు వేశారు. ధర్మవరం నుంచి పుట్టపర్తి, ఎన్.ఎస్.గేటు వైపు రాకపోకలు చేసే వాహనదారులు రహదారికి మరోవైపు వెళ్లాల్సి వచ్చింది. ధర్మవరం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎన్నికల సభ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా.. రోడ్డుపై వైకాపా ఎన్నికలసభ ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. నడిరోడ్డుపై ప్రచార సభ ఎలా నిర్వహిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ మార్గంలో రాకపోకలకు ఆటంకం కలిగింది. సభాప్రాంగణం సమీపంలోనే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ముసుగు వేయకుండా అలాగే వదిలేశారు. ఎన్నికల సభ నిర్వహించడంపై ధర్మవరం ఆర్డీవో, రిటర్నింగ్ అధికారి వేంకట శివరామిరెడ్డిని వివరణ కోరగా ఎన్నికల కోడ్ రాక మునుపు సభ నిర్వహణకు అనుమతి తీసుకున్నారని, పోలీసులు మైక్ పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. రహదారిపై కాకుండా పక్కన సభ నిర్వహిస్తామని చెప్పడం వల్లే అధికారులు అనుమతులు ఇచ్చారని వివరించారు.
source : eenadu.net
Discussion about this post