ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అరాచకాలకు తెరతీశారని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో అడ్డదారిలో గెలవాలని కేశవ్ దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో అక్రమంగా రూ.వేల కోట్లు కూడబెట్టారన్నారు. అలా వెనకేసుకున్న డబ్బులోని రూ.2 కోట్లతో ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలతో గ్రామాల్లో చీరల పంపిణీ చేయిస్తున్నారన్నారు. గతంలోనూ ఎమ్మెల్యే కేశవ్ దొంగ ఓట్లను కాపాడుకోవడానికి విఫలయత్నం చేసి, ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను బెదిరించారన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే ప్రజలు జై కొడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. ముఖ్యంగా మహిళలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అరాచకాలు, అనైతిక చర్యలకు తెరలేపిందన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. చీరల పంపిణీకి సంబంధించి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆయన అనుచరులు, మద్దతుదారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన శంఖారావం సభలో సాక్షాత్తూ లోకేష్ సమక్షంలోనే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బరితెగించి రెండు మూడు రోజుల్లో అన్నీ సమకూర్చుతామని మాట్లాడారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకరనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్నారు. ఎన్‌ఆర్‌ఐ, కాంట్రాక్టర్లు, పెత్తందార్లకు టికెట్లు కేటాయించి, ప్రజల ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారన్నారు. ఉరవకొండలో 40 ఏళ్ల పాటు ఎన్నో పోరాటాలు చేసి, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన విశ్వేశ్వరరెడ్డిపై గెలవాలనే ఆలోచనతో ఎమ్మెల్యే కేశవ్ అరాచకాలకు తెరలేపారన్నారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్, వివిధ రూపాల్లో దోచుకున్న డబ్బుతో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. చీరలు, ముక్కునత్తిలు, కమ్మలు, బంగారు కడియాలు ఇచ్చినా మహిళలందరూ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైపే ఉన్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని ప్రతిపక్షాలకు అర్థమైపోయిందన్నారు. ఇటువంటి తరుణంలో ఎన్నికల్లో అడ్డదారిలో గెలవాలని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేవలం చుట్టపుచూపుగానే ఎమ్మెల్యే కేశవ్ ఉరవకొండకు వచ్చారని విమర్శించారు. ఎన్ని కుట్రలు, కుంత్రాలు చేసినా వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
source : sakshi.com
Discussion about this post