వచ్చే శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక విషయంలో తెదేపా దూకుడు ప్రదర్శిస్తోంది. ఫిబ్రవరి 24న ఉమ్మడి జిల్లాకు సంబంధించి 9 స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. గురువారం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. పుట్టపర్తి నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి కోడలు పల్లె సింధూరరెడ్డి, కదిరి నుంచి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సతీమణి యశోదాదేవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో రెండు నియోజకవర్గాలో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 స్థానాలకు గాను 11 చోట్ల అభ్యర్థులు ఖరారయ్యారు. అనంతపురం అర్బన్, గుంతకల్లు, ధర్మవరం అభ్యర్థులు ఎవరో తేలాల్సి ఉంది. రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు కాగా 12 జనరల్ స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన 11 మంది అభ్యుర్థుల్లో ఐదుగురు మహిళలే ఉండటం విశేషం. రాప్తాడు నుంచి పరిటాల సునీత, శింగనమల నుంచి బండారు శ్రావణిశ్రీ, పెనుకొండ నుంచి సవిత పోటీ పడుతుండగా తాజాగా సింధూరరెడ్డి, కందికుంట యశోదాదేవిని అభ్యర్థులుగా తెదేపా ప్రకటించింది. గతంలో ఏ పార్టీ నుంచి కూడా ఇద్దరికి మించి మహిళలకు టికెట్లు ఇచ్చిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
source : eenadu.net
Discussion about this post