నంద్యాల జిల్లా బనగానపల్లెకు ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో స్థానిక ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండుకు రాకపోకల్ని నిలిపేయడంతో పాటు బహిరంగసభ ప్రాంగణం అక్కడకు కూతవేటు దూరంలో ఉందన్న సాకుతో పోలీసులు ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అటు వైపు ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు. అక్కడి నుంచి తీవ్రమైన ఎండలో నడిచి రావడానికి ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. వృద్ధులు, చిన్నారుల పరిస్థితిపై బస్సు డ్రైవర్, కండక్టర్లను కొంతమంది నిలదీసినా తామేమీ చేయలేమని వారు చేెతులెత్తేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు బస్సుల కోసం ఎక్కడికి వెళ్లాలో సమాచారం తెలియక ఆందోళనకు గురయ్యారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా అక్కడికి చేరుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది.
బహిరంగ సభలో జగన్ మాట్లాడుతుండగానే అందులో పాల్గొనడానికి వచ్చిన వందల మంది వెనక్కి వెళ్లిపోయారు. ఎండ తీవ్రతకు తోడు సభా ప్రాంగణంలో తగిన సంఖ్యలో ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో సభలోని వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రాక ముందు ఆయన విజయాలతో కూడిన వీడియోలు, నృత్యాలను ప్రదర్శించారు. అందులో ఓచోట ‘జై శ్రీరామ్… జై శ్రీరామ్..’ అని పాట వచ్చే సమయంలో తెరపై సీఎం ఫొటోలు రావడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పొత్తుపెట్టకోవడం నేరమన్నట్లు చిన్నారులతో నృత్యరూపకాలను ప్రదర్శించడం గమనార్హం.
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి పిలిచి తమను అవమానించారంటూ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ పాసుల పేరుతో ముందు సీట్లలో వైకాపా నాయకులు, కార్పొరేటర్లను కూర్చోబెట్టి, తమకు వెనుకవైపు సీట్లు కేటాయించారని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగభూషణంనాయుడు ప్రశ్నించారు. కర్నూలు నగరపాలకసంస్థ కమిషనర్ భార్గవ్‌తేజ జోక్యం చేసుకుని సీనియర్ న్యాయవాదులను ముందు కూర్చోబెట్టారు.
source : eenadu.net
Discussion about this post