జనసేన, భాజపాలతో పొత్తు పెట్టుకుంది… వైకాపాను ఓడించడానికే కాదు… రాష్ట్రాన్ని గెలిపించడానికి కూడా… అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మూడు పార్టీలూ చేతులు కలిపాయని వెల్లడించారు. కిందిస్థాయిలోనూ అందరూ కలిసి పనిచేయాలని తెదేపా క్లస్టర్, యూనిట్, బూత్‌స్థాయి కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు టెలికాన్ఫరెన్స్‌లో మంగళవారం వారితో మాట్లాడారు. సర్వేలు, నివేదికల ఆధారంగా పలు అంశాల గురించి చర్చించారు. ఇంటింటికీ సూపర్-6 పథకాల ప్రచారంలో మంచి పనితీరు కనబరిచిన కార్యకర్తల్ని అభినందించారు. ‘రాష్ట్రాన్ని జగన్ పూర్తిగా విధ్వంసం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీశారు. వైకాపా రివర్స్ పాలనలో రాష్ట్రం నష్టపోయింది. దుష్టపాలనను అంతం చేయడానికి తెదేపా-జనసేన-భాజపా కలిసి పోటీ చేస్తున్నాయి. మళ్లీ రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని గాడిన పెట్టాలంటే కేంద్ర సహకారం అవసరం’ అని చంద్రబాబు వివరించారు. గతంలో పలు సందర్భాల్లో ఎన్డీయేతో కలిసి తెదేపా పనిచేసిందని… కీలక భాగస్వామిగా వ్యవహరించిందని గుర్తుచేశారు. ఆయా సమయాల్లో కేంద్రం నిధులతో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని వివరించారు. ఈరోజు గ్రామాల్లో కనిపిస్తున్న రహదారులు అప్పుడు వేసినవేనన్నారు. ‘పోలవరం పూర్తికి, రాజధాని నిర్మాణానికి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సాయం అవసరం. కేంద్ర ప్రభుత్వంలో మనం భాగస్వామిగా ఉన్న ప్రతి సందర్భంలోనూ రాష్ట్రానికి న్యాయం జరిగింది’ అని చంద్రబాబు చెప్పారు.
టికెట్ పొందిన అభ్యర్థుల పనితీరును చివరి నిమిషం వరకూ సమీక్షిస్తానని, ప్రజల్లో లేకపోయినా, మంచిపేరు తెచ్చుకోకపోయినా మార్చడానికి వెనుకాడనని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి అభ్యర్థీ ఒక న్యాయవాదిని నియమించుకొని ప్రభుత్వ కుట్రల్ని తిప్పికొట్టాలని సూచించారు. అనేక సర్వేలు నిర్వహించి… నూతన విధానాల ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చెప్పారు. అభ్యర్థుల ప్రకటనతో పార్టీలో జోరు పెరిగిందన్నారు. ‘పోలింగ్‌లో అక్రమాల్నే జగన్ నమ్ముకున్నారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి చట్టవ్యతిరేక చర్యనూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లండి. ఎన్నికల షెడ్యూలు వచ్చాక వైకాపా ఆగడాలు, తప్పుడు అధికారుల ఆటలు సాగవు. చిలకలూరిపేటలో నిర్వహించనున్న సభకు బస్సులు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. ఇతర శాఖల అధికారులూ ఆలోచించుకోవాలి. చట్టబద్ధంగా పనిచేయాలి’ అని హితవు పలికారు. ‘పోలింగ్ ముగిసే దాకా ఎవరూ విశ్రమించొద్దు. కూటమి గెలుపు చారిత్రక అవసరం’ అని చంద్రబాబు తెలిపారు.
ప్రధాని పాల్గొనే సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటూ.. ప్రతి సీటూ ముఖ్యమేనని చంద్రబాబు అన్నారు. వాడవాడలా మూడు పార్టీల జెండాలూ కలిసి ఎగరాలని… ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే సభతో కొత్త చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. ప్రధాని పాల్గొనే ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కోరారు. ‘కూటమి ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి. వైకాపాను ఓడించి 160కు పైగా స్థానాలు గెలవాలి. ‘రా కదలి రా’, ‘శంఖారావం’ సూపర్‌హిట్ అయ్యాయి. కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపాయి’ అని చంద్రబాబు అన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 56 వేల మంది పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post